మయన్మార్‌లో సైనిక తిరుగబాటుతో నెలకొన్న అనిశ్చితిని అంతం చేసే దిశగా ఆసియాన్ దేశాలు చేపట్టిన చర్యను భారత్ స్వాగతించింది. మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించడంలో తాము నిర్మాణాత్మక, అర్థవంతమైన పాత్ర పోషిస్తామని పేర్కొంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
"ఏప్రిల్ 24న జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో మయన్మార్‌లో హింసను అంతం పలికే దిశగా ఆసియాన్ దేశాలు చూపిన చొరవను మేము స్వాగతిస్తున్నాము. ఈ ప్రయత్నాలను బలోపేతం చేసేలా.. మయన్మార్‌తో మేం సంప్రదింపులు జరుపుతాం. మయన్మార్ ప్రజలకు భారత్ ఓ ఆత్మీయ నేస్తం. మయన్మార్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను రూపుమాపేలా.. నిర్మాణాత్మకమైన, అర్థవంతమైన చర్చలు జరుపుతాం. "
-అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి