తెలంగాణ

telangana

ETV Bharat / international

'వ్యక్తిగత గోప్యతను తీవ్రంగా పరిగణిస్తున్నాం' - ఆధిపత్యం ఆమోదయోగ్యం కాదు

వాట్సాప్​లోకి పెగసస్​ స్పైవేర్​ పంపడం ద్వారా భారత ప్రముఖుల మీద నిఘా ఉంచారన్న వార్తలు దేశంలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్​ ప్రసాద్.. వ్యక్తిగత గోప్యతకు భంగం కల్పించడాన్ని భారత్​ తీవ్రంగా పరిగణిస్తుందని, డేటాతో సమాజంపై ఆధిపత్యం చలాయించాలనుకోవడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.

వ్యక్తిగత గోప్యతను తీవ్రంగా పరిగణిస్తున్నాం: ఐటీ మంత్రి

By

Published : Nov 6, 2019, 9:43 PM IST

పెగసస్​ స్పైవేర్​ను వాట్సాప్​లోకి పంపండం ద్వారా వ్యక్తిగత సమాచారంపై నిఘా పెట్టారన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ వ్యక్తిగత గోప్యతపై ఒక బలమైన సందేశాన్నిచ్చారు. భారత్..​ వ్యక్తిగత గోప్యతను తీవ్రంగా పరిగణిస్తుందని, వ్యక్తుల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా సమాజంపై ఆధిపత్యం చలాయించాలనుకోవడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన కామన్​వెల్త్​ దేశాల న్యాయశాఖ మంత్రుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు రవిశంకర్.

ప్రస్తుత సమాచార విప్లవ యుగంలో డేటా కీలక పాత్ర పోషిస్తోందన్నారు కేంద్రమంత్రి. ఈ నేపథ్యంలోనే భారత్​లో వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

పాత్రికేయులు, సామాజిక ఉద్యమకారులే లక్ష్యంగా

ఇజ్రాయెల్​కు చెందిన పెగసస్​ అనే స్పైవేర్​ను ఉపయోగించిన హ్యాకర్స్..​ ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల వ్యక్తిగత సమచారాంపై నిఘా పెట్టారు. వారిలో భారత్‌లోని పాత్రికేయులు, సామాజిక ఉద్యమకారులు ఉన్నారని వాట్సాప్​ సంస్థ ఇటీవలే వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ప్రసాద్​ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

'డేటాపై గుత్తాధిపత్యం ఆమోదయోగ్యం కాదు'

వాణిజ్య ఉపయోగం, ఉపాధి పరంగా సమాచార నిధి కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు రవిశంకర్. కొన్ని కంపెనీలు, దేశాలు డేటా సామ్రాజ్యవాదం ద్వారా గుత్తాధిపత్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అది తమకు ఆమోదయోగ్యం కాదని మంత్రి హెచ్చరించారు.

భారత్​లో డేటా చట్టం పూర్తి పరిణామం, జస్టిస్​ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు, ప్రజా సంప్రదింపుల గురించి మంత్రి ప్రస్తావించారు. పార్లమెంటు లో ఇందుకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టేందుకు పరిశీలిస్తున్నామని వెల్లడించారు రవిశంకర్.

ఇదీ చూడండి: పార పట్టి మురికి కాలువను శుభ్రం చేసిన మంత్రి!

ABOUT THE AUTHOR

...view details