భారత్‌పై ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు తిజ్జన్ మహ్మద్ బండే ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ వేదికల్లో భారత్ ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న భారత్.. వివిధ రంగాల అభివృద్ధికి కృషి చేయగలదని పేర్కొన్నారు.
"సాంకేతికత, ప్రజలు, వారి ఆలోచనల పరంగా.. ప్రపంచదేశాలకు భారత్ ఎంతో ముఖ్యం. వివిధ అంతర్జాతీయ సంస్థల్లో శక్తిమంతమైన సభ్య దేశంగా భారత్ కొనసాగుతోంది. ఆయా దేశాలు ఐరాస వేదికగా చర్చలు జరపడానికి, భద్రతా మండలి సభ్య దేశంగా భారత్ కృషి చేయగలదు."
-- తిజ్జన్ మహ్మద్ బండే, ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు.
ఐరాస భద్రతామండలిలోని 5 తాత్కాలిక సభ్యదేశాల కోసం జూన్ 17న జరిగిన ఎన్నికల్లో భారత్ ఘనవిజయం సాధించింది. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 192లో.. 184 ఓట్లు దక్కించుకుంది. భారత రెండేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది.