సరిహద్దులో అతిక్రమణలకు పాల్పడినట్లు భారత్ తనకు తెలియకుండానే ఒప్పుకుందని చైనా అడ్డగోలు విమర్శలు చేసింది. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలకు భారత్ కారణమంటూ నోరుపారేసుకుంది. ఆదివారం కేంద్ర మంత్రి వీకే సింగ్ మాట్లాడుతూ.. భారత్, చైనా సరిహద్దులను అధికారికంగా గుర్తించలేదని వెల్లడించారు. "చైనా 10 సార్లు అతిక్రమణలకు పాల్పడితే.. మనం 50 సార్లు అతిక్రమణలు చేయాలి. చైనా విస్తరణ కాంక్షతో దురాక్రమణకు పాల్పడుతోంది. కానీ, దాని ఆటలు సాగవని కేంద్రం భరోసా ఇచ్చింది" అని చైనా తీరును మంత్రి ఎండగట్టారు.
వీకే సింగ్ విమర్శలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ స్పందించారు. "భారత్ తెలియకుండానే సరిహద్దు ఉద్రిక్తతల్లో తన ప్రమేయాన్ని అంగీకరించింది. మా భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నంలో భాగంగా ఆ దేశం తరచూ దురాక్రమణలకు పాల్పడుతోంది" అని భారత్‌పై నోరుపారేసుకున్నారు.