పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్‌కు రానున్నారు. ఈ ఏడాది చివర్లో దిల్లీలో నిర్వహించే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఇమ్రాన్‌ను ఆహ్వానిస్తామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ విలేకరుల సమావేశంలో గురువారం ప్రకటించారు. ఎస్‌సీఓలో పాక్‌తో పాటు 8 సభ్యదేశాలు, నాలుగు అబ్జర్వర్ స్టేట్స్తో పాటు ఇతర అంతర్జాతీయ ప్రతినిధులను భారత్ ఆహ్వానించనున్నట్లు స్పష్టం చేశారు.
వివాదాల నడుమ భారత్‌కు ఇమ్రాన్!
భారత్-పాకిస్థాన్ మధ్య గత మూడేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉరీలోని సైనిక శిబిరంపై ఉగ్రదాడులు, అందుకు ప్రతిగా భారత సైన్యం చేసిన మెరుపుదాడులతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. గతేడాది పుల్వామాలో.. సైన్యం ప్రయాణిస్తున్న వాహనాలపై పాకిస్థాన్ బాంబు దాడులకు పాల్పడడంతో... బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలను వైమానిక దాడులతో భారత్ నాశనం చేసింది. తర్వాత కశ్మీర్‌లో అధికరణ- 370 రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో భారత్-పాక్ మధ్య వివాదాలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో.. ఇమ్రాన్ వస్తారా.. లేదా... అన్న అంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.