కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్ల నుంచి భారత్ చురుకుగా స్పందిస్తోందని చెప్పారు ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజినల్ డైరెక్టర్(ఆగ్నేయ ఆసియా) పూనం ఖేత్రపాల్ సింగ్. కరోనాపై పోరుకు అవసరమైన చర్యలను భారత్ స్థిరంగా చేపడుతోందని కితాబిచ్చారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే వైద్య సదుపాయలు మెరుగుపరిచారని, వైరస్‌పై పోరుకు సన్నద్ధమయ్యారని వర్చువల్ ర్యాలీలో వివరించారు.
" కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. పరీక్షల సామర్థ్యాన్ని పెంచింది. అనేక ఆస్పత్రులను సిద్ధం చేసింది. ఔషధాలను, వైద్యపరికరాలను అందుబాటులో ఉంచింది. ఇతర దేశాలతో పోల్చితే భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం లేదు. కొత్త కేసుల్లో పెద్దగా వ్యత్యాసం ఉండటంలేదు. వైరస్ వ్యాప్తి కూడా తక్కువగా ఉంది. ఎక్కువ జనసాంద్రత ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అధిక కేసులు నమోదవుతున్నాయి. భారత్ లాంటి అధిక జనాభా గల దేశంలో కరోనాను కట్టడి చేయడమంటే సాధారణ విషయం కాదు. ప్రభుత్వం మొదట్నుంచీ పకడ్బందీగా చర్యలు చేపడుతోంది."