India Pakistan Nuclear Exchange: 31 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారత్, పాకిస్థాన్ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి దేశంలోని అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయకూడదు అనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను అందజేసుకున్నాయి. ద్వైపాక్షిక మార్గంలో ఇరుదేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు విదేశాంగ శాఖ శనివారం తెలిపింది.
"భారత్, పాకిస్థాన్ దౌత్యమార్గాల ద్వారా.. దిల్లీ, ఇస్లామాబాద్ తమ అణుస్థావరాల జాబితాను పంచుకున్నాయి. ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తైంది. ఈ జాబితాను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ఇది వరుసగా 31వ సారి."
-భారత విదేశాంగ శాఖ
అణు స్థావరాలపై దాడులకు వ్యతిరేకంగా కుదిరిన 'అటాక్స్ అగైనెస్ట్ న్యూక్లియర్ ఇన్‌స్టాలేషన్స్ అండ్ ఫెసిలిటీస్' ప్రకారం ఈ వివరాలను పరస్పరం అందజేసుకున్నాయి. 1988 డిసెంబర్ 31న ఈ ఒప్పందంపై భారత్, పాకిస్థాన్ సంతకం చేశాయి. ఏటా అణు స్థావరాల సమాచారం అందించుకోవాలని ఇందులోని ఆర్టికల్-2 నిబంధన స్పష్టం చేస్తుంది. ఈ ప్రకారం 1992 జనవరి 1 నుంచి ప్రతి సంవత్సరం ఇరుదేశాలు అణు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి.
ఖైదీల వివరాలు సైతం
India pakistan prisoners: అణు స్థావరాలతో పాటు పాక్‌లో ఉన్న భారతీయ ఖైదీల వివరాలు, భారత్‌లో ఉన్న పాక్ ఖైదీల వివరాలను ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. పాక్ కస్టడీలో ఉన్న భారత్‌కు చెందిన 356 మంది మత్స్యకారులు, ఇద్దరు పౌరులను తిరిగి స్వదేశానికి పంపాలని పాకిస్థాన్‌ను భారత్ కోరింది. అంతేగాకుండా 182 మంది మత్స్యకారులు, 17 మంది పౌరులకు తక్షణమే 'కాన్సులర్ యాక్సిస్' అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ తెలిపింది.