గతేడాది నవంబర్‌లో ఆర్టికల్ 370, 35 ఏ రద్దు తర్వాత... భారత ప్రభుత్వం కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లను సూచిస్తూ భౌగోళిక మ్యాప్‌ను విడుదల చేసింది. ఆ రేఖాపటంలో పాక్ ఆక్రమిత కశ్మీర్, కాలాపానీ కూడా ఉంది. అయితే కాలాపానీని మ్యాప్‌లో గుర్తించడంపై నేపాల్ అభ్యంతరం లేవనెత్తగా.. అది తమ దేశంలో అంతర్భాగమని స్పష్టం చేసింది భారత్.
ఇటీవల చైనా సరిహద్దులో అత్యంత కీలకమైన రహదారిని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని దార్చులా నుంచి లిపులేఖ్ కనుమ వరకు 80 కి.మీ. పొడవున దీనిని నిర్మించారు. సముద్ర మట్టానికి 17వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రహదారి కారణంగా కైలాస్-మాన్‌సరోవర్ వెళ్లడానికి మార్గం సుగమమయింది. లిపులేఖ్ కనుమ నుంచి మాన్‌సరోవర్ కేవలం 90 కి.మీ.దూరంలో ఉంటుంది. ఈ మార్గంలో మాన్‌సరోవర్ యాత్రకు ఇంతవరకు మూడు వారాల సమయం పడుతుండగా, ఈ రహదారి కారణంగా వారంలోనే ముగించే అవకాశం ఉంది. సరిహద్దులో సైనిక బలగాలను వేగంగా తరలించడానికి కూడా వీలు కలిగింది.
ఈ రహదారి ప్రారంభంతో మరోసారి భారత్-నేపాల్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలాపానీ తమదని కాఠ్మాండూ ప్రభుత్వం ఉద్ఘాటించింది.
మాదే అంటున్న నేపాల్..
భారత్ రహదారి ప్రారంభించడాన్ని ఖండించిన నేపాల్.. తమ భూభాగంలో ఎటువంటి కార్యకలాపాలకు అనుమతి లేదని చెప్పింది. అంతేకాకుండా 1816 సుగౌలీ ఒప్పందం ప్రకారం మహాకాళీ నది తూర్పున ఉన్న లింపియాదుర,కాలాపానీ, లిపు లేఖ్లు నేపాల్‌లో భాగమని పేర్కొంది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. నేపాల్ ఆరోపణలను ఖండించమే కాకుండా ఇటీవల ప్రారంభించిన రహదారి భారత్‌లోని ఉత్తరాఖండ్లోనిదని స్పష్టం చేసింది. అలనాటి సుగౌలీ ఒప్పందాన్ని మరోసారి ఉదహరించింది.
ఏమిటీ 'సుగౌలీ ఒప్పందం'?
భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న కాలాపానీ ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదంగా ఉంది. ఉత్తరాఖండ్‌లోని పితోడ్‌గఢ్, నేపాల్‌లోని దర్చులా జిల్లాలకు సరిహద్దుగా ఉంది. మహాకాళి నది ఈ ప్రాంతం నుంచి ప్రవహిస్తోంది. 1816లో 'సుగౌలీ' ఒప్పందం ప్రకారం మహాకాళీ నదిని నేపాల్ పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. మహాకాళీ నదిలో కాలపానీ వద్ద అనేక ఉపనదులు కలుస్తాయి. ఈ ప్రాంతం ట్రై జంక్షన్ లాంటింది. నేపాల్, చైనా, భారత సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి. దీంతో రక్షణపరంగా దీనికి ప్రాధాన్యం ఉంది. భూటాన్‌లోని డోక్లాంకు ఎంతటి ప్రాధాన్యం ఉందో కాలాపానీకి అంతే గుర్తింపు ఉంది. 1962 భారత్-చైనా యుద్దం నాటి నుంచి కాలాపానీ భారత్ అధీనంలో ఉంది.
మాటలకు ముందే బలగాలతో..