శ్రీలంక మరోమారు అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ద్వీప దేశంలో శనివారం జరగనున్న ఎన్నికలను పొరుగు దేశాలైన భారత్-చైనాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్నందున.. శ్రీలంకను భౌగోళికంగా ముఖ్యమైన దేశంగా భావిస్తున్నాయి.
చైనాతో సఖ్యతగా ఉన్నప్పటికీ.. భారత్తో సత్సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండని శ్రీలంక అధ్యక్షుడి సలహాదారు సమన్ వీరసింఘే తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. "భారత్-శ్రీలంక మధ్య బంధం 1000 ఏళ్ల నాటిది.. ఈ రెండు కేవలం మిత్రదేశాలే కాదు అంతకుమించి" అని వ్యాఖ్యానించారు. ఇరుదేశాల బంధం రాబోయే కాలంలో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
"అభివృద్ధి చెందుతున్న దేశమైనందున శ్రీలంకకు పెట్టుబడులు అవసరం. ఇతర దేశాలతో పాటు చైనా ప్రభుత్వం, అక్కడి సంస్థలు మా దేశంలో ఎన్నో పెట్టుబడులు పెట్టాయి. శ్రీలంకతో ఆర్థిక రంగ సత్సంబంధాల్లో భాగంగా.. భారత ప్రభుత్వం మా దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేస్తుందని భావిస్తున్నా."
- సమన్ వీరసింఘే
ఇతర ఆసియా దేశాల తరహాలోనే..
ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇతర ఆసియా దేశాల తరహాలోనే.. శ్రీలంక కూడా ఆర్థిక విధానాలను సరళీకృతం చేయాల్సిన అవసరముందని సమన్ వీరసింఘే అభిప్రాయపడ్డారు. భారత్, పాకిస్థాన్ లాంటి దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు రంగాల పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు, అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.