మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎశ్ తిరుమూర్తి తెలిపారు. మయన్మార్ నాయకత్వం ఐకమత్యంగా ఉండి వీలైనంత త్వరగా శాంతియుత పంథాలో సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ వెల్లడించింది.
"భారతదేశం మయన్మార్‌తో భూమి, సముద్ర సరిహద్దును పంచుకుంటుంది. ఆ దేశంలో శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉంది. మయన్మార్‌లో ఇటీవల పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసేందుకు మయన్మార్ చేసిన కృషి నిర్వీర్యం కాకూడదు.
మయన్మార్, ఆ దేశ ప్రజలకు అత్యంత దగ్గరి స్నేహితుడిగా వారికి సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. మాతో కలిసి వచ్చే దేశాలతో మయన్మార్ ప్రజల ఆశలను ఎల్లప్పుడూ మేం గౌరవిస్తాం."