2027కు ముందే చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది. ఈ మేరకు చైనా విడుదల చేసిన లెక్కలు భారతదేశ జనాభా వృద్ధి అంచనాలు పెంచాయి. 2027 నాటికి చైనా జనాభాను భారత్ అధిగమిస్తుందని 2019లోనే ఐరాస అంచనా వేసింది. అదే సమయంలో 2050 నాటికి దాదాపు 27.3 కోట్ల మందిని భారత్ తన జనాభాలో చేర్చుకుంటుందని నాటి నివేదికలో తెలిపింది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. 2019లో భారత జనాభా 1.37 బిలియన్లు కాగా.. చైనా జనాభా 1.43 బిలియన్లు.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
తాజాగా చైనా విడుదల చేసిన పదేళ్ల జనాభా లెక్కల ప్రకారం.. ఆ దేశ జనాభా 1.41178 బిలియన్లకు చేరుకుంది. వచ్చే ఏడాది నుంచి ఈ సంఖ్య తగ్గుతుందని చైనా అధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఈ మేరకు 2027కి ముందే భారతదేశ జనాభా చైనాని అధిగమించవచ్చని ఆ దేశ అధికారిక దినపత్రిక 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. జనాభా తగ్గుదలతో వినియోగ స్థాయి పతనం సహా.. కార్మిక కొరతకు దారితీస్తుందని.. ఇది ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణుల అంచనా.