సమయం దొరికినప్పుడల్లా భారత్‌లో మానవహక్కల ఉల్లంఘన అంటూ గొంతు చించుకునే పాకిస్థాన్... ఆ విషయంలో తాను ఏం చేస్తోందనే విషయాన్ని విస్మరిస్తూ ఉంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి బలూచిస్థాన్ వరకు మైనారిటీలపై అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. స్వతంత్రం కోసం పోరాడుతున్న బలూచిస్థాన్ ప్రజలను క్రూరంగా హింసిస్తోంది.
అయినప్పటికీ పట్టు వదలకుండా బలూచ్ ప్రజలు స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై తమ గళాన్ని వినిపిస్తున్నారు. న్యూయార్క్, లండన్‌లో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తమకు మద్దతివ్వాలని ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తున్నారు.
అయితే వీరి పోరాటానికి అంతర్జాతీయంగా ఎంతవరకు మద్దతు లభిస్తోంది? భారత్ వీరి పోరుకు సహకరిస్తోందా? బలూచ్ ప్రజల పట్ల ఐక్యరాజ్య సమితి వైఖరేంటి? అనే విషయాలపై బలూచిస్థాన్ ఉద్యమ కార్యకర్త, 'బలూచ్ పీపుల్స్ కాంగ్రెస్' ఛైర్పర్సన్ నాలా ఖాద్రీ బలూచ్ ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సాగిస్తున్న కుట్రలు, ప్రజల పోరాటం, స్వతంత్రం సాధించేందుకు చేస్తున్న పోరాటంపై పలు విషయాలు వెల్లడించారు.
ఉగ్రవాదులు కాదు స్వతంత్ర యోధులు
ఇటీవలే కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజీపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా.. దీనికి బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత ప్రకటించుకుంది. ఈ తిరుగుబాటు బృందం బలూచిస్థాన్ స్వతంత్రం కోసం కొన్నేళ్లుగా పోరాడుతోంది.
అయితే.. కొందరు ఈ తిరుగుబాటు బృందాన్ని ఉగ్రవాదులుగా అభివర్ణిస్తున్నారని, వీరు ఉగ్రవాదులు కారని, స్వతంత్ర సమరయోధులని నాలా ఖాద్రీ పేర్కొన్నారు. స్వతంత్రం కోసం పోరాడటం, ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనటం మధ్య చాలా తేడా ఉందని అన్నారు.
"స్వేచ్ఛ కోసం బలూచ్ ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని అణచివేస్తున్నారు. బలూచ్ ప్రజల స్వరం వినిపించకుండా చేస్తున్నారు. ప్రపంచానికి తమ గళం వినిపించడానికి బలూచిస్థాన్‌లోని యువత తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రపంచం పూర్తిగా కపటమైనది. మా ఇళ్లను నాశనం చేసి, పిల్లలు, మహిళలను అపహరించే పాకిస్థాన్ సైనికులే నిజమైన ఉగ్రవాదులు."
-నాలా ఖాద్రీ
ముఖాముఖి సారాంశం
రాజకీయ మార్గాలు, రాజకీయ పోరాటం ద్వారా మీరు స్వేచ్ఛను సాధించగలరా?
రాజకీయ మద్దతు కోసమే మేము చాలా దేశాల తలుపు తట్టాం. రాజకీయ మార్గాలు లేకుండా మేం ఏదీ సాధించలేం. బలూచిస్థాన్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు పాకిస్థాన్ ముస్లిం లీగ్ కన్నా పాతవి. మా రాజకీయ ఉద్యమాలు వాటి పని అవి చేస్తున్నాయి. స్వేచ్ఛను సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ మేము శాంతియుత రాజకీయ మార్గాన్నే నమ్ముతున్నాం.
మీ పోరాటాలపై ప్రపంచం ఎందుకు శీతకన్ను వేస్తోంది?
దేశాలు వారి ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. ఐక్యరాజ్య సమితి తన నిధుల్లో ప్రధాన వాటా చైనా నుంచే పొందుతుంది. కాబట్టి మా సమస్యలను ఐరాస అర్థం చేసుకోవడం కష్టమవుతోంది. కొన్ని దేశాలకు అఫ్గానిస్థాన్‌లో పాక్ మద్దతు కావాలి. మరికొందరికి వాఘా సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు. మేం ఏ దేశాన్ని పక్కనబెట్టడానికి ఇష్టపడటం లేదు. ప్రతి దేశం సార్వభౌమత్వాన్ని ఆస్వాదించాలనే కోరుకుంటున్నాం. బలూచిస్థాన్ అంటే ఖనిజాలు పుష్కలంగా ఉండే ప్రాంతం మాత్రమే కాదు. ఇది మా మాతృభూమి.
బలూచిస్థాన్ స్వతంత్ర సంగ్రామానికి భారత్ ఆజ్యం పోస్తోందని పాకిస్థాన్ ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలపై మీరేమంటారు?
బలూచిస్థాన్ ఉద్యమాన్ని ఖండించడానికే ఈ వాదన చేస్తోంది. బలూచ్ ఉద్యమానికి మద్దతు ఇచ్చే విధంగా భారత్‌లో రాజకీయ సంకల్పం లేదు. మా ఉద్యమానికి తమ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని భారతీయులు కోరుకుంటున్నారు. కానీ ఈ విషయంలో వారు ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయారు. కాంగ్రెస్ అయినా భాజపా అయినా బలూచిస్థాన్ స్వేచ్ఛపై భారత ప్రభుత్వం పాకిస్థాన్‌తో రాజీపడింది.