తెలంగాణ

telangana

ETV Bharat / international

కాలుష్య మరణాలకు ప్రపంచ రాజధానిగా భారత్​...!

కాలుష్య సంబంధిత మరణాలకు భారత్​ ప్రపంచ రాజధానిగా మారిందంటున్నాయి నివేదికలు. అర్ధాంతరంగా ఆయువు తీరి దాపురిస్తున్న చావుల్లో  40 శాతం వాహన, పారిశ్రామిక కాలుష్యాల పుణ్యమే అంటున్నాయి గణాంకాలు. యావత్​​ ప్రపంచంలోని కాలుష్య కష్టాల గురించి తెలుసుకుందాం.

India is the world's capital for pollution deaths!
కాలుష్య మరణాలకు ప్రపంచ రాజధానిగా భారత్​...!

By

Published : Dec 21, 2019, 8:46 AM IST

కాలుష్య సంబంధిత మరణాలకు ప్రపంచ రాజధానిగా మారిన భారత్‌ స్థానానికి ఇప్పట్లో ఢోకా లేదని సరికొత్తగా వెలుగు చూసిన అధ్యయన నివేదికాంశాలు నిర్ధారిస్తున్నాయి. ఆరోగ్యం, కాలుష్యాలపై 40 దేశాలకు చెందిన నాలుగు వందల సంస్థలతో కూడిన అంతర్జాతీయ భాగస్వామ్య వ్యవస్థ- జీఏహెచ్‌పీ. అది 2017 సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాల్లో 15శాతం కాలుష్యం పద్దులోనివేనంటూ, అత్యధిక ప్రాణనష్టం చోటుచేసుకున్నది ఇండియా చైనాల్లోనేనని వివరాలు క్రోడీకరించింది.

గణాంకాలు

దేశదేశాల్లోని అటువంటి అర్ధాంతర మరణాలు 83 లక్షలు. అందులో 23 లక్షలకుపైగా భారత్‌, సుమారు 18 లక్షల మేర చైనా ఖాతాల్లో నమోదయ్యాయి. నైజీరియా (2.79లక్షలు), ఇండొనేసియా (2.32లక్షలు), పాకిస్థాన్‌ (2.23లక్షలు) తరవాతి స్థానాల్లో వాటి వెన్నంటి నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఆ ఏడాది రెండు లక్షల వరకు అర్ధాంతర మరణాలు, కాలుష్య విస్తృతిని కళ్లకు కట్టేవే. బంగ్లాదేశ్‌, రష్యా, ఇథియోపియా, బ్రెజిల్‌నూ కలిపి లెక్కిస్తే కాలుష్య సంబంధిత మరణాల్లో మూడింట రెండొంతులదాకా ఈ పది దేశాల్లోనే వెలుగుచూశాయని జీఏహెచ్‌పీ నివేదిక ధ్రువీకరిస్తోంది.

అర్ధాంతరంగా ఆయువు తీరి దాపురిస్తున్న చావుల్లో 34లక్షల(40శాతం) వరకు వాహన, పారిశ్రామిక కాలుష్యాల పుణ్యమే. అలా విడిగా వర్గీకరించి చూసినా తొలి రెండు స్థానాలు చైనా(12.42లక్షలు), ఇండియా(12.40లక్షలు)లవే. పరిస్థితి తీవ్రతను ఆకళించుకుని కశ్మలకారక పరిశ్రమలు, సంస్థలపట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్న చైనాలో పదేళ్లుగా వాయుకాలుష్య మరణాలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో దేశీయంగా 23శాతం మేర పెరుగుదల నమోదుకావడం ఇక్కడ కాలుష్య నియంత్రణ ఎంతగా చతికిలపడిందో నిరూపిస్తోంది!

గగ్గోలు పుట్టిస్తోంది

దేశవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వాయుకాలుష్యం మూలాన సంభవిస్తున్నదేనని, పీల్చే గాలీ విషతుల్యమై సగటున 1.7 సంవత్సరాల దాకా పౌరుల ఆయుర్దాయం తరిగిపోతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్‌ఆర్‌) నివేదిక ఏడాది క్రితం వెల్లడించడం గగ్గోలు పుట్టించింది. వాయుకాలుష్యం వల్ల ప్రజల జీవితకాలం తెగ్గోసుకుపోతున్నదని ఏ భారతీయ అధ్యయనమూ తేల్చిచెప్పలేదంటూ కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆ నివేదికనే ఇటీవల తోసిపుచ్చడం ఎందరినో విస్మయపరచింది. అమాత్యులకు గుర్తుందో లేదో- దేశంలోని అర్ధాంతర మరణాల్లో 30 శాతం వరకు వాయుకాలుష్యం వల్ల చోటుచేసుకుంటున్నవేనని సీఎస్‌ఈ (వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం) అధ్యయనం రెండేళ్ల క్రితమే విపులీకరించింది.

సరికొత్త అంతర్జాతీయ అధ్యయన నివేదికా దేశంలో కాలుష్యం పెచ్చరిల్లి లక్షలాది కుటుంబాల్ని దుర్భర శోక సంద్రంలో ముంచేస్తున్న వైనాన్ని ఆవిష్కరించింది. భారత్‌లో పారిశుద్ధ్యం, గృహావరణ కాలుష్య పరిస్థితి కొంత మెరుగుపడిందంటున్న జీఏహెచ్‌పీ నివేదిక- పారిశ్రామికీకరణ, పట్టణీకరణల పేరిట కశ్మల విజృంభణకు చురుగ్గా పగ్గాలు వేయాల్సిన ఆవశ్యకతను ఉద్బోధిస్తోంది. రసాయన వ్యర్థాలు కలిసిన నీటితో పండించిన సేద్య ఉత్పత్తుల్ని వాడితే నాడీమండలం, జీర్ణ వ్యవస్థలపై దుష్ప్రభావం తప్పదంటున్న వైద్యనిపుణుల హెచ్చరికలు- కాలుష్యముప్పు వంటిళ్లలోకీ చొరబడిందనడానికి ప్రబల సంకేతాలు. విషపూరిత వాతావరణం జనజీవనాన్ని ఇంతగా కుంగదీస్తున్న దశలో, జాతీయస్థాయి సమగ్ర కార్యాచరణకు కేంద్రం పూనిక వహించక తప్పదు!

పాతికేళ్ల క్రితమే

మానవకల్పిత మహా విషాదాన్ని పాతికేళ్ల క్రితమే ఊహించిన ఆసియా అభివృద్ధి బ్యాంకు- జల, వాయు కాలుష్యాలను సమర్థంగా అరికట్టలేకపోతే ఆసియా పసిఫిక్‌ ప్రాంతం తీవ్ర ఇక్కట్ల పాలుకావడం అనివార్యమని ఆనాడే ప్రమాదఘంటికలు మోగించింది. జీవావరణ పరిరక్షణను లక్షించి భారత వైద్య పరిశోధన మండలి మొదలు ప్రపంచబ్యాంకు వరకు పలు సంస్థలు మార్గదర్శక ప్రణాళికలకు రూపుదిద్దాయి. తరతమ భేదాలతో అవన్నీ ఆచరణలో కొల్లబోవడంవల్లే- కాలుష్య కాసార దేశంగా ఇండియా పరువు ప్రతిష్ఠలు అంతర్జాతీయంగా గుల్లబారుతున్నాయి. ఇక్కడి గాలి, నేల, నీరు విషకలుషితమై పర్యావరణానికి ఎలా తూట్లు పడుతున్నాయో వేరెవరో చెప్పనక్కరలేదు.

లక్ష్యాన్ని గాలికొదిలేసి..

దేశంలోని సగానికి పైగా నదుల్లో నీరు తాగడానికి పనికిరాదని లోగడ సర్కారీ అధ్యయనమే స్పష్టీకరించింది. దేశంలో జల, వాయు కశ్మలాన్ని కట్టడి చేసేందుకే అవతరింపజేసిన కాలుష్య నియంత్రణ సంస్థలు మౌలిక లక్ష్యాన్ని గాలికొదిలేసి అవినీతిపుంతలు తొక్కుతున్నాయి. పొరుగున చైనాలో అటువంటి నియంత్రణ వ్యవస్థ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ సత్ఫలితాలు సాధిస్తుండగా, ఇక్కడ- నిబంధనల్ని అతిక్రమించి దొరక్కుండా తప్పించుకోవడమెలాగో పరిశ్రమలకు తామే సలహాలందించి జేబులు నింపుకొంటున్న పలువురు విధిద్రోహులకు అవి నెలవులై భ్రష్టుపడుతున్నాయి.

అదుపు సంగతి దేవుడెరుగు- దేశంలో కలుషిత నగరాలు, పట్టణాల జాబితా పోనుపోను విస్తరిస్తోంది. కాలుష్య నియంత్రణకు అయిదేళ్ల ప్రణాళికను చైనా అమలుపరుస్తుండగా- పౌరుల భాగస్వామ్యంతో అత్యంత పరిశుభ్ర వాతావరణం నెల కొల్పడంలో ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌, ఎస్తోనియా వంటివి పోటీపడుతున్నాయి. జనావాసాలు, కార్యాలయాలు, రహదారులు, జలాశయాలు... అంతటా అన్నింటా కాలుష్య నియంత్రణ ప్రభుత్వాల అభివృద్ధి అజెండాలో అంతర్భాగమై సామాజికోద్యమ స్థాయికి విస్తరిస్తేనే- భారత్‌లోనూ వాతావరణం తేటపడేది!

ఇదీ చూడండి : 'పౌర'చట్టంపై అట్టుడికిన భారతావని.. ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details