చైనాలో ఇప్పటికీ కొనసాగుతున్న ప్రయాణ, వీసాపరమైన ఆంక్షలపై అక్కడి భారతీయ వ్యాపారవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటి వల్ల తమ కార్యకలాపాలకు ఆటంకం ఎదురవుతోందని అన్నారు. చైనాకు భారత రాయబారిగా ఉన్న విక్రమ్ మిస్త్రీతో జరిగిన సమావేశంలో మాట్లాడిన పలు సంస్థల సీఈఓలు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
షాంఘై పర్యటనలో ఉన్న మిస్త్రీ.. శుక్రవారం అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్కు చెందిన పలు సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. ఎనిమిది కీలక రంగాలకు చెందిన 30 మంది ప్రతినిధులతో మాట్లాడారు.
ఈ ఆంక్షలపై వారంతా తమ సమస్యలను వెల్లడించగా.. వాటిపై చైనా ప్రభుత్వంతో చర్చిస్తామని మిస్త్రీ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత ఎంబసీ ఇందుకోసం నిర్విరామంగా కృషి చేస్తుందని మిస్త్రీ చెప్పినట్లు పేర్కొన్నాయి.