భారత్-చైనా మధ్య సంబంధాలు(india china relations) మరింత ఆందోళనకర స్థితికి చేరుకుంటున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను చైనా పదే పదే ఉల్లంఘిస్తోందని, అందుకు విశ్వసనీయ వివరణ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను ఏ స్థాయికి తీసుకుకెళ్తారనే విషయంపై చైనా నాయకత్వమే సమాధానం చెప్పాలని జైశంకర్ స్పష్టం చేశారు(india china news). సింగపూర్‌లో బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమిక్ ఫోరమ్‌లో 'గ్రేటర్ పవర్ కాంపిటీషన్: ద ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్' ప్యానెల్‌ను అడిగిన ప్రశ్నలకు బదులుగా ఆయన సమాధానం చెప్పారు.
'ద్వైపాక్షిక సంబంధాల్లో ఇరు దేశాలు ఏ స్థితిలో ఉన్నాయనే విషయంపై చైనాకు ఎలాంటి సందేహాలు లేవని నేను భావిస్తున్నా. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యితో చాలాసార్లు భేటీ అయ్యా. నేను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, సహేతుకంగా చెప్పా. అస్పష్టత లేదు కాబట్టి నేను చెప్పిన విషయాన్ని వారు సరిగ్గానే విని ఉంటారు' అని జైశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవన్నారు.
ప్రపంచంలో తిరుగులేని శక్తిగా చైనా ఎదిగిందని, అమెరికా స్థానాన్ని భర్తీ చేసే స్థాయికి చేరుకుందని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 'అది చాలా హాస్యాస్పదం' అన్నారు జైశంకర్. చైనా విస్తరిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, దాని స్వభావం, ప్రభావితం చేసే తీరు చాలా భిన్నమని పేర్కొన్నారు. అమెరికా అత్యంత అనువైన భాగస్వామ్య దేశమని, గతంలో కంటే ఆలోచనలు, సలహాలు, పని ఏర్పాట్లలో చాలా స్వేచ్ఛగా ఉందని వివరించారు.