భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధంపై 'ప్రాదేశికత'కు సంబంధించిన సంక్లిష్టమైన వివాదాస్పద సమస్యలు ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. 4000 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ (ఎల్ఓఏసి) వెంబడి ఇటీవలి పరిణామాలే ఇందుకు నిదర్శనం.
సాధారణం కంటే అధికంగా నియంత్రణ రేఖ వెంబడి మోహరింపులు జరుగుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం, 1200 నుంచి 1500 పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు ముఖాముఖీకి సిద్ధంగా ఉన్నాయి. తూర్పు లద్ధాఖ్‌లో ముఖ్యంగా పాంగోంగ్ సరస్సు ఒడ్డున, గాల్వాన్ నదీ లోయ వంటి అయిదు ప్రాంతాల్లో ఈ మోహరింపులతో పాటు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు భారత్, చైనా దేశాల నుంచి పరస్పరం రెచ్చగొట్టేలా, దూకుడుతో కూడిన అధికారిక ప్రకటనలేమీ వెలువడక పోవడం కొంత సానుకూల పరిణామం. కానీ ఈ వివేకం, నిగ్రహం సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గిస్తాయా? అనేదే ప్రస్తుతం నెలకొన్న ప్రశ్న.
ఈ రాజకీయ, సైనిక విబేధాల నేపథ్యంలో వచ్చే వారం నుంచి అంటే జూన్ మొదటి వారంలో కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను ఖాళీ చేస్తామని బీజింగ్ ప్రకటించింది. ఇది భారతదేశంలో ప్రస్తుతమున్న కొన్ని వేల మంది చైనా పౌరుల కోసమే చైనా ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. అయితే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది చైనా పౌరులు ఎక్కడికక్కడ నిలిచిపోయినప్పటికీ వారి విషయంలో మాత్రం ఇలాంటి నిర్ణయం వెలువడలేదు.
19వ శతాబ్దంలో
భారతదేశం, చైనా వరుసగా 1947, 1949లలో స్వాతంత్య్రం సాధించాయి. రెండూ పురాతన నాగరికతలున్న దేశాలే. వలసరాజ్యాల పాలన 19వ శతాబ్దంలో దేశ పటాలలో విభజనకు దారితీసాయి. తత్ఫలితంగా వలసరాజ్య ఆలోచనలకు అనుగుణంగా సరిహద్దులను ఏర్పరుచుకున్నా , ఏకాభిప్రాయంతో అంగీకరించిన సరిహద్దులు భారతదేశం, చైనా రెండింటికీ అస్పష్టంగా ఉన్నాయి.
సంక్లిష్ట ప్రాదేశిక వివాదంపై ఇరుదేశాలు అక్టోబర్ 1962లో సంక్షిప్త యుద్ధానికి పాల్పడ్డాయి, అది ఎటువంటి తీర్మానం లేకుండా ముగిసింది, దాదాపు ఆరు దశాబ్దాల తరువాత, అశాంతితో కూడిన స్తబ్ధత కొనసాగుతోంది. గత దశాబ్దంలో వాస్తవాధీన రేఖ వెంట మూడు ప్రధాన సైనిక దాడులు జరిగాయి-డెప్సాంగ్ (2013), చుమర్ (2014), డోక్లాం (2017) ఇలా ప్రతి ఒక్కటి రాజకీయ-దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం అయ్యాయి.
భారతదేశంలో జరుగుతున్న ప్రస్తుత సంఘటనల కాలక్రమానుసారం ఏప్రిల్ మూడో వారంలో పీఎల్‌ఏ దళాలు లద్ధాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంట తమ స్థానాలను చడీ చప్పుడు లేకుండా బలంగా ఏర్పరుచుకున్నాయి. ఈ విషయం తర్వాత బయటపడింది. మే మొదటి వారంలో పీఎల్ఏ చొరబాటు/అతిక్రమణలు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. పీఎల్ఏ మోహరింపు సంఖ్య పరంగా చూస్తే 5000 దాటింది. తదనుగుణంగా భారత్ కూడా తన ఏర్పాట్లతో మోహరింపునకు దిగింది.