పాకిస్థాన్ ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వద్ద ప్రస్తావించారు. షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశం వేదికగా గురువారం ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.
భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రకుట్రలను అరికట్టడంలో పాక్ తగిన విధంగా వ్యవహరించడం లేదని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. శాంతి కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను పాక్ వమ్ము చేస్తోందని జిన్‌పింగ్‌కు వెల్లడించారు. పాకిస్థాన్‌తో భారత్ శాంతియుత సంబంధాలనే కోరుకుంటోందని స్పష్టం చేశారు.
చర్చలు సానుకూలం...
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం సానూకులంగా జరిగిందని భేటీ అనంతరం మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సహకారం మెరుగుపరుచుకోవడంపై చర్చలు జరిపినట్లు తెలిపారు.
చైనాలోని వుహాన్ శిఖరాగ్ర సమావేశం జరిగిన అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాల్లో స్థిరత్వం పెరిగిందని మోదీ అన్నారు. ఒకరి సమస్యలు మరొకరు అర్థం చేసుకోగలుగుతుండటం ద్వారా నూతన రంగాల్లో సహకారానికి అవకాశం ఏర్పడిందని వివరించారు.
పరస్పరం బెదిరింపులు ఉండవు..
భారత్, చైనాలు పరస్పరం బెదిరింపులకు పాల్పడవని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి సాధనలో ఇరుదేశాలు పరస్పర సహకార ధోరణిలో కలిసి పనిచేస్తాయని ఆకాంక్షించారు.