భారత్-చైనా మధ్య సరిహద్దును పూర్తిగా గుర్తించకపోవడం వల్లే ఇరుదేశాల మధ్య పదేపదే సమస్యలు ఎదురవుతున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. విభేదాలు వివాదాలుగా మారకుండా ఇరుదేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని రెండు దేశాలు అమలు చేయాలని సూచించారు. భారత్‌తో చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఐరోపా పర్యటనలో ఉన్న వాంగ్.. పారిస్‌లోని 'ఫ్రెంచ్ అంతర్జాతీయ సంబంధాల సంస్థ'లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. భారత్, జపాన్‌లతో చైనా సంబంధాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం కవ్వింపు చర్యలను ప్రస్తావించలేదు.
"భారత్-చైనా మధ్య సంబంధాలు ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించాయి. భారత్ -చైనా మధ్య సరిహద్దును గుర్తించలేదు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ భారత్‌తో చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మేం సిద్ధం."
-వాంగ్ యీ, చైనా విదేశాంగ మంత్రి
ఏనుగు, డ్రాగన్ డాన్స్
అదే సమయంలో ఈ సమస్యలకు ద్వైపాక్షిక చర్చల్లో సరైన స్థానం కల్పించాలని వాంగ్ పేర్కొన్నారు. ఎన్నో ముఖ్యమైన విషయాలపై జిన్‌పింగ్, మోదీలు ఏకాభిప్రాయానికి వచ్చారని గుర్తు చేశారు.
"ఏనుగు, డ్రాగన్ ఒకదానితో మరొకటి పోటీ పడకుండా.. రెండు కలిసి డ్యాన్స్ చేయాలి. ఒకటి, ఒకటి కలిపితే రెండు కాదు, పదకొండు. ఇవన్నీ తాత్వికమైన దృక్కోణాలు.
విభేదాలు వివాదాలుగా మారకూడదు. విభేదాలను మరిపించేలా ద్వైపాక్షికంగా సహకరించుకోవాలని ఇరుదేశాధినేతలు అంగీకారించుకున్నారు. రెండు దేశాలకు చెందిన ముఖ్యమైన శాఖలు ఈ ఏకాభిప్రాయాన్ని అమలు చేయాలి."