ఇథియోపియా విమాన ప్రమాదం తర్వాత 'బోయింగ్ 737 మాక్స్ 8' విమానాలను నిషేధించిన దేశాల జాబితాలో తాజాగా భారత్ చేరింది. తక్షణమే వీటిని విమానాశ్రయాలకు పరిమితం చేయాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) నిర్ణయించింది.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది డీజీసీఏ. భద్రతాపరంగా అన్ని అంశాలు పరిశీలించే వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది.
భారత్‌లో స్పైస్‌జెట్ 12 , జెట్ ఎయిర్వేస్ 5 బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుత నిర్ణయంతో ఇవి తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఎదుర్కోక తప్పదు.
నిషేధించిన దేశాలు..
ఇప్పటికే సింగపూర్, చైనా, మలేసియా, ఇథియోపియా, ఆస్ట్రేలియాలు ఈ శ్రేణికి చెందిన విమానాలను తాత్కాలికంగా విమానాశ్రయాలకు పరిమితం చేశాయి. మరో వైపు తమ గగనతలంలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలు ఎగరడానికి వీల్లేదని ఐరోపా సమాఖ్య తెలిపింది.