దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత భారత్-చైనా సరిహద్దుల్లో నెత్తురు చిందింది. లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో గత ఆరు వారాలుగా నెలకొన్న ఘర్షణలు చివరకు ప్రాణనష్టానికి దారితీశాయి. భారత్ వైపు 20 మంది సైనికులు వీరమరణం పొందారు. చైనా సైతం 43 మంది కోల్పోయినట్లు సమాచారం. రెండు అణ్వాయుధ దేశాల మధ్య దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. పరిస్థితులు చేదాటితే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. పలు అంతర్జాతీయ పత్రికలు, మీడియా సంస్థలు సైతం ఈ పరిణామాలను ప్రముఖంగా ప్రచురించాయి. పరిస్థితులు మరింత దిగజారితే తలెత్తే పరిణామాలను విశ్లేషించాయి.
నిప్పు రాజేసిన చైనా..: న్యూయార్క్ టైమ్స్
"ఇటీవల చైనా యుద్ధ వాహనాలు, ఆయుధ సామగ్రి, ట్రక్కులు, సైనికులను సరిహద్దు వెంట మోహరించింది. డ్రాగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా నెలకొన్న ఉద్రిక్తతల్లో చైనా నిప్పు రాజేసినట్లైంది. తదనంతర పరిణామాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీ దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పరిస్థితులు చేదాటిపోయే ప్రమాదం ఉంది" అని అమెరికా ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
గతంలో చర్చలతోనే సద్దుమణిగాయి, కానీ..: వాషింగ్టన్ పోస్ట్
"1962 యుద్ధం మినహా తరచూ భారత్-చైనా మధ్య తలెత్తే వివాదాలు చర్చల ద్వారా పరిష్కారమయ్యేవి. కానీ, ఇటీవల రెండు దేశాల సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు" అంటూ ఎలాంటి విశ్లేషణను జోడించుకుండా వాషింగ్టన్ పోస్ట్ జరిగిన ఘటనను ప్రచురించింది.