పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నివసిస్తున్న హిందువుల చిరకాల వాంఛ నెరవేరుతోంది. రాజధాని నగరంలో హిందూ ఆలయానికి పునాది పడింది. ఆలయంతో పాటు హిందూ శ్మశాన వాటికను పాకిస్థాన్ నిర్మిస్తోంది. ఇస్లామాబాద్‌లో ఇదే తొలి ఆలయంగా నిలవనుంది.
ఇస్లామాబాద్‌లోని హెచ్-9 సెక్టార్ ప్రాంతంలో 20వేల చదరపు అడుగుల్లో నిర్మించనున్న ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. పాక్ మానవ హక్కుల విభాగం పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మాల్హీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆలయానికి 'శ్రీకృష్ణ మందిర్'గా నామకరణం చేసింది ఇస్లామాబాద్ హిందూ పంచాయత్.
"రెండు దశాబ్దాలుగా నగరంలో హిందువుల జనాభా పెరుగుతోంది. తమకు ఆలయం కావాలని చాలా కాలంగా హిందూ సమాజం కోరుతోంది. అంతేకాకుండా హిందువులకు శ్మశానవాటిక కూడా లేదు. ఆలయ సమీపంలోనే దీని నిర్మాణమూ జరుగుతుంది."
- లాల్ చంద్ మాల్హీ
ఇస్లామాబాద్‌లో 1947కు ముందు కట్టిన అనేక హిందూ ఆలయాలు ఉన్నట్లు మాల్హీ తెలిపారు. అయితే ఇవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడం వల్ల వాడకంలో లేవని చెప్పారు.