కశ్మీర్లో పవిత్ర యుద్ధం (జీహాద్) చేయడానికి పాకిస్థానీలెవరూ వెళ్లవద్దని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కోరారు. ఇలా చేస్తే కశ్మీర్ విషయంలో పాక్ చేస్తున్న పోరాటానికి తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. పాక్-అఫ్గాన్ సరిహద్దులో నిర్మించిన తోర్ఖం టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్.
"పాకిస్థాన్ నుంచి పవిత్ర యుద్ధం (జీహాద్) చేయడానికి ఎవరైనా భారతదేశానికి వెళితే.. కశ్మీరీలకు అన్యాయం చేసిన మొదటి వ్యక్తి మీరే అవుతారు. కశ్మీరీలకు శత్రువులవుతారు."- ఇమ్రాన్‌ఖాన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి
కశ్మీరీలను అణచివేసేందుకు భారత్ ఓ కారణం వెదుకుతోందని ఇమ్రాన్ అన్నారు. కశ్మీర్ నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు భారత్ ఓ తప్పుడు ఆపరేషన్ ప్రారంభించవచ్చని ఆయన పదేపదే చెబుతున్నారు.
ట్రంప్‌తో సమాలోచనలు..
వచ్చే వారం కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రస్తావించడానికి ఇమ్రాన్ సిద్ధమవుతున్నారు. పనిలోపనిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోనూ ఈ విషయమై చర్చించాలని నిర్ణయించారు.