పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి అసంబద్ధ ప్రేలాపన చేశారు. కశ్మీరీ ప్రజల సమస్యలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు... తాను 'రాయబారి'గా ఉంటానని వ్యాఖ్యానించారు.
"నేను కాశ్మీరీ ప్రజలకు రాయబారిగా ఉంటాను. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచానికి తెలియజేస్తాను. ముఖ్యంగా వివిధ దేశాధినేతలతో, ప్రభుత్వాలతో జరిగే సమావేశాల్లో కశ్మీరీల సమస్యలను లేవనెత్తుతాను. "
- ఇమ్రాన్‌ఖాన్, పాక్ ప్రధాని
భారత ప్రభుత్వం, 2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి, వాటిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్ నిర్ణయానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు సంపాదించడానికి ప్రయాసపడ్డారు. చివరకు ఏమీ సాధించలేక చతికిలపడ్డారు.
పాకిస్థాన్ ప్రయత్నాలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆర్టికల్ 370 రద్దు అనేది పూర్తిగా భారత అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేసింది. ఈ నిజాన్ని అంగీకరించి, భారత వ్యతిరేక ప్రచారాన్ని ఆపాలని పాకిస్థాన్‌ను హెచ్చరించింది.
ఇదీ చూడండి:చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం వేగవంతం