ఎఫ్-16 జెట్ విషయంలో భారతీయ జనతా పార్టీ అసత్యపు ప్రచారాలు చేస్తోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాక్‌లోని ఎఫ్-16 విమానాలన్నీ భద్రంగానే ఉన్నాయని అమెరికా మ్యాగజైన్ నివేదికపై ఈ విధంగా స్పందించారు ఇమ్రాన్. ఇటీవల అమెరికా అధికారులు పాక్‌లోని విమానాలను లెక్కించారని, అన్నీ సరిగానే ఉన్నాయని సదరు పత్రిక తెలిపింది.
నివేదికను ఆధారంగా చేసుకుని భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు పాక్ ప్రధాని.
"నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. ఎన్నికల్లో గెలవడానికి భాజపా తప్పుడు ప్రచారాలకు దిగింది. ఎఫ్-16 జెట్ల సంఖ్య సరిగానే ఉందని అమెరికా రక్షణ శాఖ అధికారులే తేల్చారు."
-ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని
పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది భాజపా.ప్రతిపక్షాలపైనా ఎదురుదాడికి దిగింది. విపక్షాల తీరుతోనే పాకిస్థాన్ అడ్డగోలుగా వాదిస్తోందని ఆరోపించారు భాజపా నేతలు.