అఫ్గానిస్థాన్‌లో తొలి మహిళ మేయర్‌గా గుర్తింపు పొందిన జరిఫా గఫారీ(Zarifa Ghafari).. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో జర్మనీకి పారిపోయిన గఫారీ.. తాలిబన్(Taliban Afghanistan) ఉగ్రమూక ఆమె కోసం వెతుకుతున్నారని ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడిన తనలాంటివారందరినీ తాలిబన్లు తప్పకుండా హత్య చేస్తారని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మేరకు తాలిబన్లు ఓ జాబితాను కూడా సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు.
"ఏ ఒక్కరినీ నేను క్షమించను. గత 20 ఏళ్లలో సాధించినవన్నీ కోల్పోయాం. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. నా దేశం నుంచి తెచ్చుకున్న మట్టి తప్ప."
--జరిఫా గఫారీ, మాజీ తొలి మహిళ మేయర్.
తాలిబన్లు ఎలాంటి వారో ఇతరులకు తెలియకూడదనే ఉద్దేశంతోనే వారు పలువురుని హత్య చేస్తున్నారని గఫారీ అన్నారు. అఫ్గాన్లు తమకు వ్యతిరేకంగా పోరాటం చేయడం తాలిబన్లకు నచ్చదని పేర్కొన్నారు. చాలా మంది నాయకులు, జర్నలిస్టులు అఫ్గాన్‌ను విడిచి పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.