భారత్, నేపాల్ మధ్య కాలాపానీ వివాదం ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరమవుతుందని... ఆ విషయంలో తనకు విశ్వాసం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావాలి. రెండు దేశాల మధ్య స్నేహభావ సంబంధాలు సుదీర్ఘ కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
"ఈ సమస్యను పరిష్కరించడానికి విశ్వాసంతో చర్చలు జరపడమే ఏకైక మార్గమని మేము ఎప్పుడూ చెబుతున్నాం. అనవసరమైన ఉద్రేకం, పక్షపాతం లేకుండా నేపాల్ సరిహద్దు సమస్యలను సంభాషణల ద్వారా పరిష్కరించాలని కోరుకుంటుంది" అని గ్యావాలి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే నేపాల్ తమవని పేర్కొన్న లింపియాధురా, లిపులేఖ్ గురించి ఆయన ప్రస్తావించలేదు.