Hyundai Kashmir Issue: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్‌కు చెందిన పాకిస్థాన్ డీలర్.. 'కశ్మీర్' వ్యవహారంపై సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్‌తో ఆ సంస్థ పెను వివాదంలో చిక్కుకుంది. దీనిపై ఇప్పటికే స్పందించిన హ్యుందాయ్.. భారత ప్రజలను ఇబ్బందులకు గురిచేసినందుకుగానూ చింతిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ వివాదంపై ఆ కంపెనీ సొంత దేశమైన దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు హ్యుందాయ్ వివాదంపై దక్షిణకొరియా విదేశాంగ మంత్రి.. భారత విదేశాంగ మంత్రితో మాట్లాడి విచారం తెలిపినట్లు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారంపై భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారికి సమన్లు కూడా జారీ అయ్యాయి.
"హ్యుందాయ్ పాకిస్థాన్ పేరుతో ఉన్న ఖాతాలో కశ్మీర్‌ను ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్ మా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్‌ను చూసిన వెంటనే గత ఆదివారం సియోల్(దక్షిణ కొరియా)లోని మన రాయబారి హ్యుందాయ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి వివరణ కోరారు. ఆ వెంటనే సోషల్‌మీడియా నుంచి పోస్ట్‌ను డిలీట్ చేయించారు. సోమవారం రిపబ్లిక్ ఆఫ్ కొరియా భారత రాయబారికి.. కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. సోషల్‌మీడియాలో వచ్చిన అనుచితపోస్టుపై భారత్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. దేశ భౌగోళిక సమగ్రతకు సంబంధించి విషయాల్లో రాజీపడేది లేదని గట్టిగా స్పష్టం చేశాం. దీనిపై కంపెనీ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం" అని అరీందమ్ బాగ్చీ ఓ ప్రకటనలో వెల్లడించారు.