తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇమ్రాన్​ఖాన్​ సర్కారుకు నిరసన సెగ.. రోడ్లపైకి ప్రజలు - పాకిస్థాన్​లో నిరసనల వార్త

ఆందోళనలతో పాకిస్థాన్​ అట్టుడుకుతోంది. పాక్​ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ.. ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలతో రహదారులపై నిరసనలకు దిగుతున్నారు.

Pak PM Imran Khan
పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​

By

Published : Oct 24, 2021, 2:23 PM IST

పాకిస్థాన్​లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన బాట పట్టారు. వేలాది మంది ప్రజలు కరాచీ వీదుల్లో కదం తొక్కారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు వేలాది మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్‌ ధరలు భారీగా పెరిగాయని ఇమ్రాన్‌ఖాన్‌ తక్షణం రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వందలాది మంది కార్మికులు ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా రాసిన బ్యానర్లను కార్మికులు ప్రదర్శించారు. పేదలకు రోజుకు రెండు పూటలా భోజనం కూడా లభించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని పదవికి ఇమ్రాన్‌ అనర్హుడని జమియత్ ఉలేమా ఇ ఇస్లాం సంస్థ నేత రషీద్ సూమ్రో అన్నారు. దేశాన్ని ఎలా నడపాలో ఇమ్రాన్‌కు తెలియదని.. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇద్దరు పోలీసులు మృతి

లాహోర్‌లోనూ భద్రతా దళాలు, ప్రజల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులను నిరసనకారులు హత్య చేయగా.. చాలామంది ఆందోళన కారులు గాయపడ్డారు. గత ఏడాది ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అరెస్ట్‌ చేసిన తమ నేతను విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు ఇస్లామాబాద్‌కు లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నారు. లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న వారిని భద్రతా దళాలు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులపై పోలీసులు బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడంతో నిరసనకారులు దాడికి దిగారు. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులు ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించకుండా ఉండేందుకు రహదారులను దిగ్బంధించారు.

ఇదీ చూడండి:చైనా నూతన సరిహద్దు చట్టం.. భారత్​పై ప్రభావం!

ABOUT THE AUTHOR

...view details