తెలంగాణ

telangana

ETV Bharat / international

కడలిలో ఖనిజాల వేట..ప్రమాదం ఎవరికి? - తాజా తెలుగు వార్తలు

కడలి గర్భంపై మనిషి కన్నుపడింది. భూగోళంపై అన్ని రకాల సహజ వనరుల్నీ కొల్లగొడుతున్న మనిషి- ఇప్పుడు సముద్రగర్భంలోని విలువైన ఖనిజ నిక్షేపాల్ని తవ్వితీయడానికి సమాయత్తమవుతున్నాడు. సముద్రగర్భ మైనింగ్‌కు పోటీపడుతున్న కంపెనీలు అధునాతన యంత్ర సామగ్రినీ సిద్ధం చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇప్పటికే కొన్నిచోట్ల లైసెన్సులు కూడా పొందాయి. దీనివల్ల సముద్రంలోని కోటానుకోట్ల జీవరాశుల ఉనికికి ముప్పు ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

human being started mining at undergruond of sea.. experts says its was more dangerous to live in future
కడలిలో ఖనిజాల వేట..ప్రమాదం ఎవరికి?

By

Published : Feb 17, 2020, 7:20 AM IST

Updated : Mar 1, 2020, 2:12 PM IST

భూమ్మీద ఉన్న సహజ వనరుల్ని ఇష్టానుసారం వాడేస్తున్న మనిషి కన్ను ఇప్పుడు సముద్ర గర్భంలోని విలువైన ఖనిజ నిక్షేపాలపై పడింది. వాటిని తోడేసుకోవడానికి భారీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సముద్ర గర్భం నుంచి ఇప్పటికే ఇనుము, పెట్రో ఉత్పత్తుల్ని తవ్వితీస్తున్నాడు. కొత్తగా రాగి, నికెల్‌, వెండి, ప్లాటినం, బంగారం, విలువైన రత్నాల్లాంటి ఖనిజాల్నీ తవ్వి తీయడానికి కంపెనీలు పోటీపడుతున్నాయి. భూమిపై సహజ వనరుల విపరీత వాడకంతో కలుగుతున్న నష్టాల్ని కళ్లారా చూస్తున్నాం. ఇక సముద్ర గర్భంలోనూ మైనింగ్‌ అలజడి మొదలైతే.. ఆ విపరిణామాల్ని ఊహించడం కూడా కష్టమేనని.. మానవాళి జీవనంపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏ కంపెనీ ఎక్కడ తవ్వుతుంది?

ప్రపంచంలోని అతిపెద్ద ఖనిజాల కార్పొరేషన్లు పలుచోట్ల సముద్రగర్భ మైనింగ్‌ కార్యకలాపాల్ని ప్రారంభించాయి. ఆఫ్రికా పశ్చిమతీర సముద్రగర్భం నుంచి వజ్రాల వెలికితీతకు 'డి బీర్స్‌' గ్రూపు అధునాతన నౌకల్ని రంగంలోకి దించింది. ఇవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర సామగ్రి సాయంతో నమీబియా తీర జలాల్లోంచి 2018లో 14 లక్షల క్యారెట్ల వజ్రాలను వెలికి తీశాయి. 'నాటిలస్‌ మినరల్స్‌' అనే మరో కంపెనీ పపువా న్యూగినియా తీరంలోని సముద్రగర్భం వేడినీటి బుగ్గల్లో విలువైన ఖనిజాల కోసం శోధిస్తోంది. అయితే స్థానికులు దీన్ని వ్యతిరేకించగా కంపెనీ ఆర్థికంగా కుంగిపోయింది. తమదేశ తీరాల్లోని సముద్ర గర్భంలో ఖనిజ నిల్వల్ని తవ్వుకోవడానికి జపాన్‌, దక్షిణ కొరియాలు ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుల్ని ప్రారంభించాయి. అట్లాంటిక్‌, పసిఫిక్‌, హిందూ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరపడానికి దాదాపు 30 కంపెనీలు అంతర్జాతీయ సముద్రగర్భ అథారిటీ(ఐఎస్‌ఏ) నుంచి లైసెన్సులు, పర్మిట్లు పొందాయి.

నియంత్రించేది ఎవరు?

సముద్ర గర్భంలో మైనింగ్‌ను నియంత్రించడంపై అంతర్జాతీయంగా ఇప్పటిదాకా పటిష్ఠమైన వ్యవస్థంటూ ఏమీ లేదు. ఈ బాధ్యతల్ని అంతర్జాతీయ సముద్రగర్భ అథారిటీ(ఐఎస్‌ఏ)కి ఐక్యరాజ్యసమితి కట్టబెట్టింది. దీనికి జమైకాలోని కింగ్‌స్టన్‌ హార్బర్‌ వద్ద కార్యాలయాలున్నాయి. సెక్రెటరీ జనరల్‌ మైఖేల్‌ లాడ్జ్‌ నేతృత్వంలో ఏడాదికోమారు ఇది సమావేశం అవుతూ ఉంటుంది. దాదాపు 168 దేశాల ప్రతినిధులు దీనికి హాజరవుతూ ఉంటారు. ఏయే ప్రాంతాల్లో తవ్వకాలకు అనుమతించాలి? ఏ కంపెనీకి లైసెన్సులు ఇవ్వాలి? వ్యర్థాల్ని ఎలా తరలించాలి? పర్యావరణానికి ముప్పును ఎలా అరికట్టాలి? అనే వాటిపైనే ఇది ఎక్కువగా చర్చిస్తుంది. సముద్రగర్భ మైనింగ్‌ కోడ్‌ తయారీ పనిలో నిమగ్నమై ఉంది.

కడలిలో ఖనిజాల వేట

లోలోతుల్లోకి వెళ్లి...

సముద్రపు లోతుల్ని శాస్త్రవేత్తలు 5 భాగాలుగా గుర్తించారు. 1.సూర్యరశ్మి సోకే ప్రాంతం(ఇక్కడ మొక్కలు జీవిస్తాయి). 2 మసక చీకటి ప్రాంతం(ఇక్కడ చీకటి మొదలవుతుంది). 3.మధ్యరాత్రి ప్రాంతం(ఇక్కడ కొన్ని జీవులు సొంత వెలుతురును సృష్టించుకుంటాయి). 4.అగాథం (గడ్డకట్టిన ఉపరితల ప్రాంతం). 5.అత్యంత లోతైన ప్రాంతం(6 వేల మీటర్ల కన్నా లోతు). అత్యంత లోతైన ప్రాంతం ఉపరితలంపై రాగి, మాంగనీసు, నికెల్‌, కోబాల్ట్‌ లాంటి ఖనిజాల ముద్దలున్నట్లు గుర్తించారు. సముద్ర ఉపరితలం లోతుల్లోకి తవ్వితే వెండి, బంగారం లాంటి ఖనిజాలున్నట్లు కనుగొన్నారు. ఉపరితలంపై గోల్ఫ్‌బాల్‌ పరిమాణంలో ఉండే ఖనిజపు ముద్దల్ని బయటికి తేవడం సులువని మైనింగ్‌ కంపెనీలు భావిస్తున్నాయి. ఇందుకోసం కంపెనీలకు ఐఎస్‌ఏ లైసెన్సులు ఇచ్చింది. ఈ లైసెన్సుల్లో క్లారియన్‌-క్లిపర్‌టన్‌ జోన్‌(సీసీజెడ్‌) అని పిలిచే ప్రాంతంలో తవ్వకాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఇది హవాయ్‌-మెక్సికోల నడుమ దాదాపు 17 లక్షల చదరపు మైళ్ల ప్రాంతం. ఒకసారి మైనింగ్‌ కోడ్‌ అమల్లోకి వస్తే దాదాపు డజను కంపెనీలు సీసీజెడ్‌ ప్రాంతంలో పారిశ్రామిక స్థాయిలో తవ్వకాలు ప్రారంభిస్తాయి.

ఎలా తవ్వుతారు?

అంతర్జాతీయ సముద్ర జలాల్ని బార్లా తెరిస్తే.. వాణిజ్య మైనింగ్‌ ప్రారంభించడానికి కంపెనీలు అధునాతన నౌకలు, యంత్ర సామాగ్రిని సమకూర్చుకుంటున్నాయి. సముద్రం అడుగున ఉపరితలాన్ని యంత్రాలు తవ్వుతుంటే.. పౌండ్లకొద్దీ మడ్డిని నీటిపై తేలియాడే నౌకలు గొట్టాల ద్వారా పైకి లాగేస్తాయి. అందులోంచి లోహపు భాగాల్ని వేరుచేసి.. మిగతా మడ్డిని తిరిగి సముద్రంలోకే పారబోస్తాయి. ప్రతి మైనింగ్‌ నౌక రోజుకు 20 లక్షల క్యూబిక్‌ అడుగుల వ్యర్థాల్ని వదులుతుందని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అంచనావేసింది.

సముద్రగర్భ మైనింగ్‌తో నష్టాలేమిటి?

*సముద్రగర్భ ఉపరితలం నుంచి ఖనిజాల్ని వెలికి తీసి.. మడ్డిని తిరిగి సముద్రంలోకి పంపడం పెద్ద క్రతువు. సముద్ర గతి(సీ కరెంట్‌) తరచూ మారుతూ ఉంటుంది కాబట్టి.. ఇలా వదిలేసిన మడ్డి తిరిగి అట్టడుగుదాకా వెళుతుందా? ఎన్ని రోజులకు అడుగుకు చేరుతుంది? అలా చేరేటపుడు ఎన్ని కిలోమీటర్ల మేర వ్యాపిస్తుంది? అనేవి అంతుచిక్కని ప్రశ్నలు.

* మనిషి, మొక్కల ఆరోగ్యానికి సముద్ర సూక్ష్మజీవులు ఎంతో అవసరం. ఒక మిల్లీలీటరు సముద్రపు నీటిలో 10 లక్షలకు పైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మైనింగ్‌ మడ్డితో ఇవన్నీ అంతరించొచ్చు. నీటిలో ఆక్సిజన్‌ శాతమూ తగ్గిపోవచ్చు.

* మడ్డి విస్తరిస్తే సూర్యకిరణాలు సముద్రపు లోతుల్లోకి చొచ్చుకువెళ్లలేవు. దానివల్ల సూర్యరశ్మి ఆధారంగా బతికే జీవరాశి, సముద్రంలోనే పెరిగే ప్రత్యేక వృక్షజాతి అంతరించే అవకాశం ఉంది. పగడపు దిబ్బలు నాశనం కావొచ్చు.

* మనిషి ఆహార అవసరాల్ని గణనీయంగా తీరుస్తున్న చేపలు, రొయ్యలు, పీతల్లాంటి వాటి మనుగడకు ముప్పు ఏర్పడి, మానవాళికి ఆహార కొరత ఏర్పడొచ్చు.

భూగర్భ మైనింగ్​ నమూనా

* లోతుల్లో తవ్వకాల వల్ల ప్రమాదకర రసాయనాలు వెలువడితే అవి జీవరాశిని హరింపజేస్తాయి.

*ఖండాల అనుసంధాన పలకలు(టెక్టోనిక్‌ ప్లేట్స్‌) పటుత్వం తగ్గే ప్రమాదం ఉంది. అప్పుడు భూకంపాలు, సునామీలు సంభవించొచ్చు. ఇప్పుడున్న ఖండాలు జలమయం కావొచ్చు.

*జలాంతర్గాముల ప్రయాణం గందరగోళంలో పడొచ్చు.

*సముద్రమే ఆధారంగా వృద్ధిచెందిన తీరప్రాంత పర్యాటక రంగం ముప్పును ఎదుర్కొనవచ్చు.

* సముద్ర ఆధార రుతుపవన చక్రం ప్రభావితం కావొచ్చు లేదా గతి మారొచ్చు.

అన్ని ఖండాల భూ ఉపరితలంపై ఉన్న విలువైన ఖనిజాల కంటే ఎక్కువగా అంతర్జాతీయ సముద్ర జల గర్భాల్లో ఉన్నాయి. వీటిని మైనింగ్‌ కంపెనీలు వెలికితీయడం మొదలుపెడితే ఇక వాటి పంట పండినట్లే!!

ఇప్పటికే లైసెన్సులు పొందిన కంపెనీలు 30

ఏమేం తవ్వితీస్తారు?: రాగి, నికెల్‌, వెండి, ప్లాటినం, బంగారం, రత్నాలు.

దేనికి నష్టం?:సముద్ర జీవులు, పర్యావరణానికి.

Last Updated : Mar 1, 2020, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details