ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకు చివరి క్షణాలు అత్యంత కీలకం. సకాలంలో అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స అందినా, రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అంబులెన్స్‌లో అందించిన చికిత్సతో కొద్దిసేపు ఆ ప్రాణాలు మినుకుమినుకుమన్నా.. ఆసుపత్రిలో కొంత ఆలస్యమైతే ఇక ఆ రోగి బతకడం చాలా కష్టం. ఇలాంటి సంఘటనలు హృదయవిదారకం. మరి అంబులెన్స్‌లో ఉన్నప్పుడే ఆ రోగి ఆరోగ్య వివరాలు తెలుసుకుని, ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు చేస్తే? సమయం ఆదా అవడం వల్ల రోగి ప్రాణాలు నిలుస్తాయి. మరి ఇది నిజంగా జరుగుతుందా? అంత కచ్చితత్వంతో, అంత వేగంగా సమాచార పంపిణీ సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. చైనాలోని ఓ ఆసుపత్రి ఈ పనిని చేసి చూపించింది. ఇందుకు '5జీ సాంకేతికత' సంజీవనిగా మారింది.
ప్రపంచమంతా ఇప్పుడు 5జీ సాంకేతికతవైపు అడుగులు వేస్తోంది. చైనాలోని గ్యాంగ్జౌ రాష్ట్రానికి చెందిన ఓ ఆసుపత్రి.. ఈ సాంకేతికతను అందిపుచ్చుకుని 5జీ అంబులెన్స్‌తో రోగుల ప్రాణాలను రక్షిస్తోంది. ఈ అంబులెన్స్‌లోని వైద్య పరికరాలు, కెమెరాలకు 5జీ సాంకేతికతను అనుసంధానించారు. దీంతో ఆసుపత్రిలోని వైద్యులు అంబులెన్స్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించవచ్చు. రోగి అంబులెన్స్‌లోకి ఎక్కిన వెంటనే.. సిబ్బంది ఓవైపు ప్రాథమిక చికిత్స అందిస్తూనే మరోవైపు సంబంధిత పరీక్షలు చేసి సమస్యను కనుగొనేందుకు త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశముంటుంది. ఈ పరీక్షల్లో రోగికి గుండెపోటు వచ్చినట్టు తేలితే, ఆసుపత్రిలో వైద్యులు తక్షణమే అప్రమత్తమై.. చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు.
"ఉదాహరణకు.. ఛాతి నొప్పి వచ్చిన రోగిని అంబులెన్స్‌లో ఎక్కించుకున్నారు అనుకుందాం. ఆ రోగికి అక్కడే ఎలక్ట్రోకార్డియోగ్రఫి పరీక్ష చేస్తారు. ఆ పరీక్ష ఫలితాలను ఆసుపత్రికి వెంటనే చేరవేస్తారు. అందులో ఎక్యూట్ మయోకార్డియో ఇన్ఫార్క్షన్ అని తేలితే.. వెంటనే ఆసుపత్రిలో కాథెటెరైజేషన్ ల్యాబొరేటరీని సిద్ధం చేస్తారు. దీంతో చాలా సమయం ఆదా అవుతుంది. రోగి ఆసుపత్రికి చేరుకున్న వెంటనే, ఎమర్జెన్సీ విభాగం, సీసీయూ కాకుండా తక్షణమే కాథెటెరైజేషన్ ల్యాబ్‌కు తీసుకెళ్లవచ్చు. దీంతో రోగి ప్రాణాలు రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి."
--- లియూ జింగ్టియో, గ్యాంగ్డాన్ జనరల్ హాస్పిటల్ చీఫ్ ఫిజీషియన్.