తెలంగాణ

telangana

ETV Bharat / international

తాలిబన్లు అంత సంపన్నులా? రూ.వేల కోట్లు ఎలా సంపాదించారు? - how taliban earn money

అఫ్గాన్​ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు అత్యంత సంపన్నులు. ఫోర్బ్స్‌ 2016లో రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 10 అత్యధిక సంపద గల ఉగ్రవాద సంస్థల్లో వారు ఐదో స్థానంలో నిలిచారు. 2019-20లో తాలిబన్ల బడ్జెట్‌ 1.6 బిలియన్ డాలర్లు. వీరు ఇంత డబ్బు ఎలా సంపాదించారు?

How rich is the Taliban? what is the source of income for them?
తాలిబన్లు అంత సంపన్నులా?

By

Published : Aug 16, 2021, 1:57 PM IST

తాలిబన్లు శరవేగంగా అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తీరు అమెరికా, నాటో దళాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత 20 ఏళ్లుగా అమెరికా, నాటో, అఫ్గాన్‌ సేనల పాలనలో కూడా తాలిబన్లు ఆర్థికంగా బలహీనపడలేదు. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఓ ఉగ్రసంస్థ ఈ స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకోవడమనేది కొరుకుడుపడని విషయమే. ఇంతకీ తాలిబన్ల ఆర్థిక వనరులేంటి?వారికి అంత డబ్బు ఎవరు సమకూర్చారు? వంటి అంశాలను నాటో నివేదికలు, పలు పత్రికల పరిశోధనాత్మక కథనాలు వెలుగులోకి తెచ్చాయి.

ఫోర్బ్స్‌ 2016లో రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 10 అత్యధిక సంపద గల ఉగ్రవాద సంస్థల్లో తాలిబన్లు ఐదో స్థానంలో నిలిచారు. రెండు బిలియన్ డాలర్ల వార్షికాదాయంతో ఐసిస్‌ తొలి స్థానంలో ఉండగా.. 4 మిలియన్ డాలర్లతో తాలిబన్లు ఐదో స్థానంలో ఉన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, కిడ్నాప్‌లు, సానుభూతిపరుల నుంచి నిధులు, విరాళాలే వీరి ప్రధాన ఆర్థిక వనరులని ఫోర్బ్స్‌ తెలిపింది.

ఇదే అంశంపై నాటో రూపొందించిన ఓ నివేదికకు ‘రేడియో ఫ్రీ యూరప్‌(ఆర్‌ఎఫ్‌ఈ)’ బహిర్గతం చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2019-20లో తాలిబన్ల బడ్జెట్‌ 1.6 బిలియన్ డాలర్లు(రూ.11వేల కోట్లకు పైగా). ఈ విషయాన్ని వెల్లడించింది ఎవరో కాదు.. తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ కుమారుడు ముల్లా యాకూబ్‌. నాటో తయారు చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఈ నిధుల్లో అక్రమ గనుల ద్వారా 464 మిలియన్ డాలర్లు, మాదకద్రవ్యాల రవాణా ద్వారా 416 మిలియన్ డాలర్లు, విదేశీ విరాళాల ద్వారా 240 మిలియన్ డాలర్లు, ఎగుమతుల ద్వారా 240 మిలియన్‌ డాలర్లు, పన్నుల ద్వారా 160 మిలియన్ డాలర్లు, రియల్‌ ఎస్టేట్‌ ద్వారా 80 మిలియన్‌ డాలర్లు వచ్చాయని అంచనా. ఓ స్వతంత్ర్య రాజకీయ, సైనిక సంస్థగా ఎదగడంపై తాలిబన్లు దృష్టి పెట్టారని నాటో నివేదిక తెలిపింది. అఫ్గానిస్థాన్‌లో పౌర ప్రభుత్వం కొనసాగుతున్న సమయంలోనూ కొంత భూభాగం తాలిబన్ల అధీనంలోనే ఉండేది. అక్కడి నుంచి వీరు పన్నులు వసూలు చేసేవారు. ఎగుమతులు, డ్రగ్స్‌ అక్రమ రవాణా, మైనింగ్‌ అక్కడి నుంచే కొనసాగేవి.

నల్లమందులో 84శాతం ఇక్కడి నుంచే..

గత ఐదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా విక్రయించే నల్లమందులో 84శాతం అఫ్గానిస్థాన్‌ నుంచే వెళ్తోంది. ఈ విషయాన్ని ఐరాస ప్రపంచ మాదక ద్రవ్యాల నివేదిక 2020 పేర్కొంది. తాలిబన్ల స్వాధీనంలో ఉన్న హెల్మాండ్‌లో ఏకంగా 1,36,798 హెక్టార్లలో నల్లమందు పంటను సాగు చేస్తున్నట్లు 2018లో బీబీసీ కథనం పేర్కొంది. ఇక కాందహార్‌లో 23,410 హెక్టార్లు, రాజధాని కాబుల్‌ వద్ద కూడా 484 హెక్టార్లలో ఈ పంటను సాగు చేయడం గమనార్హం. వీటిని సాగు చేసినందుకు తాలిబన్లు 10 శాతం పన్ను రూపంలో నల్లమందు రైతుల నుంచి వసూలు చేస్తారు. తాలిబన్లు మాత్రం నల్లమందుతో తమకు సంబంధం లేదని చెబుతారు. 2000 సంవత్సరంలో అధికారంలో ఉన్న సమయంలో నిషేధించిన విషయాన్ని గుర్తు చేస్తారు.

హెరాయిన్‌ ల్యాబ్‌ల నుంచి వసూళ్లు..

ఈ నల్లమందును హెరాయిన్‌, ఇతర మాదక ద్రవ్యాలుగా మార్చే ప్రయోగశాలలు కూడా తాలిబన్ల కనుసన్నల్లో నెలకొల్పారు. దేశంలో ఇలాంటివి 500 వరకు ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిల్లో సగం తాలిబన్లకు పట్టు ఉన్న హెల్మాండ్‌లోనే ఉన్నాయి. వీటి నుంచి కూడా వారు పన్నులు వసూలు చేస్తారు. దీంతోపాటు ఎగుమతి దారుల వద్ద నుంచి కొంత మొత్తంలో సొమ్ము అందుతుంది. తాలిబన్ల ఆదాయంలో 60శాతం మాదక ద్రవ్యాల నుంచే లభిస్తుందని అమెరికా సైన్యం విశ్వసిస్తోంది. ట్రంప్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాలిబన్ల ఆదాయ వనరులను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులు చేసింది. 2018లో ఇలాంటి 200 ల్యాబ్‌లను ధ్వంసం చేసింది.

అక్రమ గనుల తవ్వకాలు..

అఫ్గానిస్థాన్‌లో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఇనుము, మార్బుల్‌, రాగి, జింక్‌తోపాటు ఇతర అరుదైన లోహాలు ఇక్కడ లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉండటంతో తాలిబన్లకు ఇది కలిసొచ్చింది. ఇక్కడ ఏటా కనీసం బిలియన్‌ డాలర్ల మైనింగ్‌ వ్యాపారం జరుగుతుంది. వీటిల్లో అక్రమంగా జరిగేదే ఎక్కువ. తాలిబన్ల స్టోన్స్‌ అండ్‌ మైనింగ్‌ కమిషన్‌ అత్యధికంగా ఏడాదికి 464 మిలియన్‌ డాలర్లు సంపాదించినట్లు నాటో నివేదిక వెల్లడించింది. 2016లో దీనికి వచ్చిన ఆదాయం కేవలం 35 మిలియన్‌ డాలర్లు మాత్రమే. ఒక్క హెల్మాండ్‌ ప్రావిన్స్‌లో తాలిబన్లు దాదాపు పాతిక గనుల నుంచి 2018 నాటికి ఏటా కనీసం 10 మిలియన్‌ డాలర్లు వసూలు చేసేవారు. ఖనిజాన్ని బట్టి ఒక్కో ట్రక్కు నుంచి అత్యధికంగా 500 డాలర్ల వరకు వసూలు చేసినట్లు అంచనా.

బలవంతపు వసూళ్లు..

తాలిబన్లు తమకు పట్టున్న ప్రాంతంలోని కంపెనీల నుంచి బలవంతంగా సొమ్మును వసూలు చేసేవారు. వీటిల్లో మీడియా, టెలీ కంమ్యూనికేషన్లు, అంతర్జాతీయ సహకారంతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టుల నుంచి వాటాలు తీసుకొనేవారు. తాలిబన్ల ఆధీనంలోని ప్రాంతాల రోడ్లపై నుంచి పోవాలన్నా ట్రక్కు డ్రైవర్లు డబ్బు చెల్లించాల్సిందే. 2.5శాతం సంపద పన్ను వసూలు చేసేవారు. ముల్లా యాకూబ్‌ అంచనా ప్రకారం ఈ మొత్తం 160 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అమెరికా నిఘావర్గాల నాటో నివేదిక పేర్కొంది.

ఎగుమతులు.. దిగుమతులు..!

ఐరాస భద్రతా మండలి నివేదిక ప్రకారం తాలిబన్లు ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం కూడా నిర్వహిస్తారు. తాలిబన్ల తరఫున నూర్జాయి బ్రదర్స్‌ అనే అంతర్జాతీయ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఆటోమొబైల్‌ విడిభాగాల దిగుమతి, రీ అసెంబుల్‌ వాహనాల విక్రయం, విడిభాగాల విక్రయాలు చేపడుతుంది.

రియల్‌ ఎస్టేట్‌..

తాలిబన్లకు పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ సహా పలు దేశాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ టీవీ ఛానల్‌ సామా బయటపెట్టింది. నాటో నివేదిక కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

విదేశీ నిధులు..

తాలిబన్లకు 2008లో విదేశాల నుంచి 106 మిలియన్‌ డాలర్లు అందినట్లు సీఐఏ నివేదిక ఇచ్చినట్లు బీబీసీ ఓ కథనంలో పేర్కొంది. వీటిల్లో గల్ఫ్‌ దేశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రష్యా, ఇరాన్‌, పాకిస్థాన్‌, సౌదీ అరేబియాల నుంచి ఆర్థిక మద్దుతు అందుతోంది. కానీ ప్రస్తుతం అందే నిధుల మొత్తాన్ని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది.

ABOUT THE AUTHOR

...view details