ప్రపంచ దేశాలను వణికిస్తున్న డెల్టా వేరియంట్(delta variant in china) వ్యాప్తిని చైనా కట్టడి చేసింది. గతంలో వచ్చిన సాధారణ కరోనా వైరస్‌ని జయించినంత తేలిగ్గా ఈ డేంజర్ 'డెల్టా'దూకుడుకు కళ్లెం వేయగలిగింది. జులై మధ్యలో తొలి కేసు వెలుగు చూడగా.. ఈ నెల మధ్యకాలం నాటికి వైరస్ మరింతగా విజృంభించింది. దీంతో అప్రమత్తమైన డ్రాగన్.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 'డెల్టా' కొమ్ములు వంచి 'సున్నా'కు తీసుకురావడంలో విజయవంతమైంది. డెల్టాను ఎదుర్కోవడంలో అనేక దేశాలు సతమతమవుతుంటే.. అత్యధిక జనాభా కలిగిన చైనాకు ఇదెలా సాధ్యమైంది?
శరవేగంగా వ్యాప్తి.. అంతే త్వరగా 'సున్నా'కి..
చైనాలోని నాన్‌జింగ్ విమానాశ్రయంలో తొలిసారి డెల్టా కేసు వెలుగుచూసింది. విమానాశ్రయంలో హౌస్‌కీపింగ్ సిబ్బందికి వైరస్ సోకింది. ఆ మరుసటి రోజే వైరస్ కేసుల సంఖ్య 12కి చేరింది. అలా.. జులై చివరి వారం నాటికి రోజువారీ కేసుల సంఖ్య 50కి పెరిగాయి. 17 ప్రావిన్సుల్లోని 50 నగరాలకు వ్యాపించిన ఈ వైరస్ మూడు వారాల్లోనే రోజువారీ కేసులు 100కి చేరుకున్నాయి. దాదాపు ఏడాది పాటు కొవిడ్ రహిత ప్రాంతంగా ఉన్న వుహాన్‌లోకి కూడా ప్రవేశించింది. ఇంత వేగంగా వ్యాప్తి చెందడం చైనా కొవిడ్ నియంత్రణ మోడల్‌కు ఓ పరీక్షగా మారింది. అయితే, చైనాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఎంత వేగంగా ఉందో.. డ్రాగన్ తీసుకున్న చర్యలతో అంతే త్వరగా అదుపులోకి వచ్చింది. ఆ మరుసటి వారానికే కొత్త కేసులు ఒక్క అంకెకు పడిపోగా.. ఆగస్టు 23 నాటికి సున్నాకు చేరడం విశేషం.
'డెల్టా' దూకుడుకు కళ్లెం ఇలా..
తొలి కేసు నమోదైనప్పటి నుంచే చైనా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా వైరస్ ప్రబలినప్పుడు ఎదుర్కొన్న వ్యూహాల అనుభవంతో డెల్టా వేరియంట్ కట్టడికి మరింత కఠినంగా వ్యవహరించింది. భారీగా పరీక్షలు నిర్వహించడంతో పాటు డెల్టా కేసులు నమోదైన ప్రాంతాల నుంచి బీజింగ్ సహా ఇతర ప్రాంతాలకు రాకపోకలపై ఆంక్షలు విధించింది. ప్రజల్ని ఎక్కడికక్కడే నిలువరించేందుకు కఠినంగా వ్యవహరించింది. కొవిడ్ హాట్‌స్పాట్ ప్రాంతాల నుంచి రైళ్లు, విమాన సర్వీసులను సైతం నిలిపివేసింది. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు వారిని ఇంట్లోనే బందీలుగా చేసి బయటి నుంచి తాళాలు వేసి.. తలుపులకు ఇనుపరాడ్లు పెట్టి సీల్ వేసిన దృశ్యాలు కూడా గతంలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.