అమెరికా నిష్క్రమణ, తాలిబన్ల(Afghan Taliban) దురాక్రమణ.. అఫ్గానిస్థాన్ వాసుల(Afghanisthan News) జీవన విధానాన్నే మార్చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి పొందుతున్న ఎంతో మందిని ఆర్థికంగా దెబ్బకొట్టింది. దాంతో ఇల్లు గడవక.. పిల్లల ఆకలి మంటలు ఎలా తీర్చాలో అర్థం గాక, ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని వచ్చినకాడికి అమ్మేస్తున్నారు. వేలకు వేలు పెట్టి కొన్న వస్తువుల్ని చాలా తక్కువ ధరలకు అమ్ముకుంటున్నామని అక్కడి ప్రజలు మీడియా ఎదుట వాపోతున్నారు. దీంతో కాబుల్(Kabul News) వీధులన్నీ సంతలను తలపిస్తున్నాయి.
'నా వస్తువుల్ని సగం ధరకే అమ్మేశాను. 25వేల అఫ్గానీలు పెట్టి కొన్న రిఫ్రిజరేటర్‌ను 5వేలకు అమ్మేశాను. నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడు నేనింకేం చేయాలి?' అంటూ లాల్ గుల్ అనే దుకాణదారుడు మీడియా ఎదుట వాపోయారు. ఇంకొందరైతే లక్షలు పోసి కొన్న వస్తువుల్ని వేలకే విక్రయించిన పరిస్థితులు కాబుల్ వీధుల్లో కనిపించాయి. కుటుంబ సభ్యుల ఆకలి తీరిస్తే చాలన్నట్లు.. టీవీలు, ఫ్రిజ్‌లు, సోఫాలు, అల్మారాలు ఇలా ఇంట్లో ప్రతి విలువైన వస్తువు అక్కడి రోడ్లపై అమ్మకానికి ఎదురుచూస్తోంది. ఇంతకు ముందు పోలీసు అధికారిగా పనిచేసిన మహమ్మద్ ఆగా.. గత కొద్ది రోజులుగా అక్కడి మార్కెట్‌లోనే పనిచేస్తున్నారు. 'వారు జీతం ఇవ్వలేదు. నాకిప్పుడు ఉద్యోగం లేదు. ఇంకేం చేయాలి?' అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు దశాబ్దాల తర్వాత అమెరికా బలగాలు వెనుతిరగడం వల్ల.. తాలిబన్లు(Afghan Taliban) మెరుపు వేగంతో కాబుల్‌ను ఆక్రమించుకున్నారు. ఇప్పటికి నెల రోజులు కావొస్తున్నా.. పాలనా పరంగా వారింకా కుదురుకోలేదు. అలాగే ఆర్థిక సమస్యలు ఆ దేశాన్ని వేధిస్తున్నాయి. మరోపక్క ఆహార కొరత తీవ్రంగా ఉంది. ప్రపంచ ఆహార కార్యక్రమం కింద అందించిన నిల్వలు ఈ నెలకు మాత్రమే సరిపోతాయని ఐరాస ఇప్పటికే హెచ్చరించింది. వీటన్నింటిని గమనిస్తుంటే అఫ్గాన్ వాసులు ముందుముందు మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోనున్నట్లు కనిపిస్తోంది.