తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ కేఫ్​లో గంజాయి కలిపిన బీరుకు సూపర్​ క్రేజ్​!

సాధారణంగా కేఫ్​లో ఏం దొరుకుతాయి? మెదడుకు ఉల్లాసాన్నిచ్చే కాఫీ-టీలు, రుచికరమైన స్నాక్స్​... అంతేనా! మరి కేఫ్​లో గంజాయి విక్రయిస్తే..? ఆహార పదార్థాల్లో గంజాయి ఉత్పత్తులను కలిపి అమ్మితే? అదీ చట్టబద్ధంగానే వీటి విక్రయాలు జరిగితే? ఏంటీ షాక్ అవుతున్నారా? ఈ కథనం పూర్తిగా చదివితే మీకే క్లారిటీ వచ్చేస్తుంది.

First cannabis-related products café opens
గంజాయి కలిపిన బీరు కావాలా? ఆలస్యమెందుకు!

By

Published : Sep 20, 2020, 8:15 PM IST

ఆ కేఫ్​లో గంజాయి కలిపిన బీరుకు సూపర్​ క్రేజ్​!

మీరు చూస్తున్నది హాంకాంగ్​లోని ఫౌండ్ కేఫ్. ఈ కేఫ్​లో కాఫీ, టీ, బిస్కెట్లతో పాటు బీరు కూడా లభిస్తుంది. ఇందులో ఏం విశేషం లేకపోయినా.. వీటిలో కలిపే పదార్థంలోనే ఉంది అసలు విషయం. కన్నాబిడోల్(సీబీడీ) అనే గంజాయి నూనె కలిపి తమ ఉత్పత్తులను అతిథులకు అందించడం ఈ కేఫ్ ప్రత్యేకత.

ఆస్ట్రేలియాలోని పెర్త్​కు చెందిన ఆల్టమ్ ఆసియా లిమిటెడ్ సంస్థ ఈ కేఫ్​ను ఏర్పాటు చేసింది. ఆల్టమ్ సంస్థ.. ఆసియా-పసిఫిక్ దేశాలకు కన్నాబినోయిడ్ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఆసియాలో సీబీడీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు హాంకాంగ్ ఓ మంచి ప్రదేశమని ఈ సంస్థ సహవ్యవస్థాపకుడు ఫియాచ్ర ముల్లెన్ అభిప్రాయపడుతున్నారు.

"ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లా కాకుండా కన్నాబినోయిడ్ మార్కెట్లు అభివృద్ధి చెందుతున్న దేశం హాంకాంగ్. ఇక్కడి చట్టాలు కూడా అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. మా ఆహార ఉత్పత్తుల్లో టీహెచ్​సీ లేనంతవరకు కన్నాబినోయిడ్స్​ను హాంకాంగ్​లో విక్రయించవచ్చు. హాంకాంగ్ సంస్కృతి కూడా అంతర్జాతీయ, చైనీస్ సంస్కృతితో మిళితమై ఉంటుంది. అందుకే సీబీడీని చైనాకు పరిచయం చేసేందుకు హాంకాంగ్​ను ఎంచుకున్నాం."

-ఫియాచ్ర ముల్లెన్, కేఫ్ వ్యవస్థాపకుడు

గంజాయి మొక్కలో వందల కొద్ది రసాయనాలు ఉంటాయి. ఇందులో టీహెచ్​సీ, సీబీడీ ముఖ్యమైనవి. ఈ సీబీడీ మత్తుకారకం కాకపోయినా.. దీనికి విశేషమైన ఔషధ లక్షణాలు ఉన్నాయని చెబుతారు. ఆహార ఉత్పత్తులతో పాటు సీబీడీతో నూనెలు, బాడీ క్రీమ్​లు, లోషన్లు, పెంపుడు జంతువులకు ఉపయోగించే ఆయిళ్లు సహా శునకాల కోసం బిస్కెట్లనూ తయారు చేస్తారు.

సీబీడీ చట్టబద్ధమే

హాంకాంగ్​లో గంజాయి చట్టబద్ధం కాదు. కానీ ఈ కేఫ్ కన్నాబిడోల్(సీబీడీ)ను ఉపయోగిస్తోంది. స్థానిక చట్టాలకు అనుగుణంగానే వీటిని వాడుతోంది. గంజాయిలో ఉండే మత్తుపదార్థమైన టీహెచ్​సీ సున్నా కంటే తక్కువ స్థాయిలో ఉంటేనే.. సీబీడీకి హాంకాంగ్​లో అనుమతిస్తారు. ఈ ఉత్పత్తులపై ప్రజల్లో ఉన్న అపోహలను తమ కేఫ్ తొలగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేఫ్ వ్యవస్థాపకుడు ముల్లెన్.

"మత్తు కోసం ఉపయోగించే గంజాయికి.. చికిత్స, జీవనశైలిలో ఉపయోగించే సీబీడీకి చాలా వ్యత్యాసం ఉంది. మేం చేసే వ్యాపారంలో మా ఉత్పత్తుల గురించి మాట్లాడటం, వాటిని చూపించడం, బ్రాండింగ్ అంతా వేరుగానే ఉంటుంది. గంజాయి కన్నా సీబీడీ గురించి మాట్లాడుకోవాలని అనుకుంటాం. గంజాయి నుంచి సీబీడీని వేరుచేయాలని భావిస్తున్నాం."

-ఫియాచ్ర ముల్లెన్, కేఫ్ వ్యవస్థాపకుడు

అమెరికాకు చెందిన లైఫ్ కంపెనీ నుంచి ఈ సీబీడీని దిగుమతి చేసుకుంటోంది ఫౌండ్ కేఫ్. ఈ సీబీడీ 99 శాతం స్వచ్ఛంగా ఉంటుందట.

సీబీడీ బీర్లు కూడా

కాఫీలే కాకుండా.. ఆల్టమ్ సంస్థ తయారు చేసే బీర్లలోనూ సీబీడీ నూనెను కలిపి కస్టమర్లకు అందిస్తున్నారు. హెయిర్​ అనే బ్రాండ్​నేమ్​తో వీటిని తయారు చేస్తున్నారు. గతనెలలోనే వీటిని మార్కెట్లోకి వదలగా.. హాట్​కేకుల్లా అమ్ముడైపోయాయి.

బీరుతో సీబీడీని కలిపి తీసుకుంటే ఆ మజానే వేరంటున్నారు సంస్థ బ్రాండ్ అంబాసిడర్ స్టెల్లా లో.

"క్రాఫ్ట్ బీర్, సీబీడీ రెండు కూడా లైఫ్​స్టైల్ ఉత్పత్తులు. మీరు బీరు తాగుతూ.. మీ స్నేహితులకో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. సీబీడీని తీసుకుంటే దాన్ని ఆ అనుభూతి పొందుతారు. మీకు ఆ సేదతీరే క్షణాలు, ప్రశాంతత అవసరం."

-స్టెల్లా లో, బీరు ప్రచారకర్త

'కాఫీ అద్భుతం'

కేఫ్​కు వచ్చే కస్టమర్లు ఈ ఉత్పత్తులపై మనసుపారేసుకుంటున్నారు. సీబీడీ కాఫీ వల్ల తాము రోజంతా హాయిగా ఉంటున్నట్లు చెబుతున్నారు.

"కాఫీ చాలా బాగుంది. నాపై సీబీడీ చూపించిన ప్రభావం నచ్చింది. రోజంతా రిలాక్స్​గా ఉండే అనుభూతిని ఇస్తుంది. శారీరకంగా, మానసికంగా బాధ నుంచి బయటపడేలా ఇది నాకు సహాయపడుతోంది."

-కిల్లియన్ హస్సీ, కస్టమర్

"నేను ఇది సేవిస్తే.. రోజంతా ప్రశాంతంగా ఉంటాను. సుదీర్ఘమైన పనిగంటలు ఉంటాయి కాబట్టి.. పనిలో ఒత్తిడికి గురైతే విశ్రాంతినిస్తుంది. నేను పడుకోవడానికి ముందు ఇది తీసుకోవాలని అనుకుంటున్నాను."

-లిండా లియు, కస్టమర్

మరి ధర?

ఓ.. వీటి ధరెంతో చెప్పలేదు కదా! సీబీడీ జతచేసిన కోల్డ్ కాఫీని సుమారు రూ.760(80 హాంకాంగ్ డాలర్లు)కు విక్రయిస్తున్నారు. సీబీడీ బీరు క్యాన్​ను రూ.664, సీబీడీ మూన్​కేక్​ను రూ.360కి అమ్ముతున్నారు.

ఫౌండ్​ కేఫ్ ప్రస్తుతం ప్యాక్​డ్ ఉత్పత్తులనే విక్రయిస్తోంది. అనుమతులు వచ్చిన తర్వాత తాజాగా తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. అందువల్ల.. ఒక ప్రాకేజ్డ్ ఉత్పత్తి కొంటే కాఫీ ఉచితంగా అందిస్తోంది ఈ కేఫ్. అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

ABOUT THE AUTHOR

...view details