హాంకాంగ్‌లో 13వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు రోజురోజుకూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తాజాగా ఆదివారం ఉదయం విమానాశ్రయాలకు వెళ్లే మార్గాలను నిరసనకారులు నిర్బంధించారు. దీంతో విమానాశ్రయానికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపేశారు.
విమానాశ్రయం దగ్గర్లోని బస్ స్టేషన్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. అల్లర్లు సృష్టిస్తున్న నిరసనకారులను పోలీసులు చుట్టుముట్టారు.
విమానాశ్రయం సమీపంలో ప్రదర్శనలను నిషేధించినప్పటికీ.. నిరసనకారులు యథాతథంగానే అదంతా పట్టించుకోలేదు. ఇంతకుముందెన్నడూ లేని హింసాత్మక ఘటనలతో ఆగస్టు నెల ముగిసింది.
పార్లమెంటు ముట్టడి
అర్ధరాత్రి సమయంలో జరిగిన ప్రదర్శనల్లో మునుపెన్నడూ లేనంత హింసాత్మక చర్యలు జరిగాయి. నగరంలోని పార్లమెంటు భవనాన్ని ముట్టడించిన నిరసనకారులపైకి పాలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను, జల ఫిరంగులను ప్రయోగించారు.
ఆగ్రహించిన ఆందోళనకారులు వారిపై పెట్రోల్ బాంబులను విసిరారు. పోలీసులు దొరికిన వారిని దొరికినట్లే అరెస్ట్ చేశారు.