హంకాంగ్‌లో 3 నెలలలుగా సాగుతున్న ఆందోళనల్లో ఆదివారం మునుపెన్నడూ లేనంత హింస చెలరేగింది. అందుకు నిరసనగా సోమవారం విద్యార్థులు సమ్మె ప్రకటించారు. పాఠశాలల్లో విద్యార్థులంతా మానవహారంగా ఏర్పడి... ప్రభుత్వంపై వ్యతిరేకత తెలియజేశారు.
కొంతమంది నిరసనకారులు నగర వీధుల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.
మునుపెన్నడూ లేనంత హింస
ఆదివారం జరిగిన ప్రదర్శనల్లో హాంకాంగ్ అట్టుడికిపోయింది. 13 వారాల పాటు సాగిన నిరసనల్లో ఎప్పుడూ లేనంత యుద్ధ వాతావరణాన్ని తలపించింది. నగరంలోని పార్లమెంటు భవనాన్ని ముట్టడించిన నిరసనకారులపైకి పాలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను, జల ఫిరంగులను ప్రయోగించారు. ఆగ్రహించిన ఆందోళనకారులు వారిపై పెట్రోల్ బాంబులను విసిరారు. పోలీసులు దొరికిన వారిని దొరికినట్లే అరెస్ట్ చేశారు.