Hong Kong bans flights: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్-19 ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది హాంకాంగ్. భారత్ నుంచి విమానాల రాకను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో మరో ఏడు దేశాలు ఉన్నాయి. జనవరి 21 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ దేశం స్పష్టం చేసింది.
''ఒమిక్రాన్ కేసుల పెరుగుదల మాకు ఆందోళన కలిగిస్తోంది. దీనిని ఎలాగైనా మేం కట్టడి చేయాలి. అందుకే.. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇండియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, యూకే, యూఎస్ దేశాల ప్రయాణికులపై రెండు వారాల నిషేధం విధించాం. శనివారం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.''
- కేరీ లామ్ చెంగ్, హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్
Hong Kong Omicron: హాంకాంగ్‌లో ఐదో వేవ్ సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో.. కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.
బుధవారం రోజు హాంకాంగ్‌లో 38 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12 వేల 799కి చేరింది. ఇప్పటివరకు 213 మంది మరణించారు.
భారత్‌లో బుధవారం ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఒమిక్రాన్ కేసులు 2 వేలు దాటాయి. ఈ నేపథ్యంలోనే.. హాంకాంగ్ ఆంక్షల జాబితాలో భారత్‌ను కూడా చేర్చింది.
Germany Restrictions:
ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు విధించాలని చూస్తోంది. ఈ మేరకు జనవరి 7న అన్ని రాష్ట్రాల గవర్నర్లతో ఛాన్స్లర్ ఉలాఫ్ షోట్స్ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.
''కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. దురదృష్టవశాత్తు ఆంక్షలు విధించడం తప్పనిసరి.''