తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎయిర్​ఇండియాపై హాంకాంగ్ రెండు వారాల నిషేధం!

కొవిడ్ నిబంధనలు పాటించలేదన్న కారణంతో ఎయిర్​ఇండియాపై హాంకాంగ్ రెండు వారాల పాటు నిషేధం విధించింది. ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్ అని నిర్ధరణ కావడం వల్ల హాంకాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విమాన సేవల పునురుద్ధరణపై హాంకాంగ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి.

Hong Kong bans Air India
ఎయిర్​ఇండియా

By

Published : Aug 20, 2020, 5:05 AM IST

ఎయిర్​ఇండియాపై హాంకాంగ్ రెండు వారాల పాటు నిషేధం విధించింది. ఎయిర్​ఇండియా విమాన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్ అని నిర్ధరణ కావడం వల్ల హాంకాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే నిషేధానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.

ఆగస్టు 18 నుంచి ఆగస్టు 31 వరకు ఈ నిషేధం అమలులో ఉండనుంది. ఫలితంగా ఆగస్టు 18, 21, 25, 28 తేదీల్లో విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.

నిబంధనలు పాటించలేదని..

వందే భారత్ మిషన్‌లో భాగంగా హాంకాంగ్ నుంచి దిల్లీకి ఎయిర్​ఇండియా విమాన సేవలు నిర్వహిస్తుంది. అయితే హాంకాంగ్‌కు వచ్చే ప్రయాణికులు 72 గంటల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకుని కరోనా నెగటివ్ సర్టిఫికెట్‌తో ప్రయాణించాలని అక్కడి ప్రభుత్వం సూచించింది.

ఇటీవల ఎయిర్​ఇండియా విమానంలో హాంకాంగ్‌కు వచ్చిన 11 మంది ప్రమాణికులకు అక్కడి విమానాశ్రయంలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. నిబంధనలు పాటించడంలేదనే కారణంతో ఎయిరిండియాపై నిషేధం విధించారు. విమాన సేవల పునురుద్ధరణపై హాంకాంగ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి.

2 వేల సర్వీసులు..

కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో అంతర్జాతీయ విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. నిబంధనలు సడలించిన తర్వాత, విదేశాల్లో ఉండిపోయిన భారతీయులను తరలించేందుకు వందే భారత్‌ మిషన్ పేరుతో ఎయిర్‌ బబుల్ ఒప్పందం ద్వారా ఎయిర్​ఇండియా అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి ప్రారంభించింది.

అందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు 2 వేల విమాన సర్వీసుల ద్వారా లక్షా యాభై వేల మంది ప్రయాణించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. తాజాగా ఈ సేవలను మరిన్ని దేశాలకు విస్తరించేందుకు ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరీ మంగళవారం తెలిపారు.

ఇదీ చూడండి:అమెరికా నుంచి భారత్​కు మరో 100 వెంటిలేటర్లు

ABOUT THE AUTHOR

...view details