అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే... యూఎస్ మిత్రదేశమైన ఇజ్రాయెల్ తటస్థంగా ఉండదని హిజ్బుల్లా నేత హసన్ నస్రాల్లా అభిప్రాయపడ్డారు. అదే జరిగితే ఇజ్రాయెల్‌పై ఇరాన్ తీవ్రంగా బాంబుల దాడి చేస్తుందని హెచ్చరించారు.
ఇరాన్‌కు మిత్ర దేశం లెబనాన్. ప్రస్తుతం లెబనాన్ ప్రభుత్వంలో హిజ్బుల్లా ప్రధాన భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ అధినేత హసన్ నస్రాల్లా. ఆయన హిజ్బుల్లాకు చెందిన అల్-మనార్ టెలివిజన్‌లో ప్రసారం చేసిన ఇంటర్వ్యూలో తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే హిజ్బుల్లాను అమెరికా ఒక ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తుండడం గమనార్హం.
యుద్ధ నివారణే శరణ్యం
అమెరికా, ఇరాన్ మధ్య కొన్ని వారాలుగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఇరాన్‌పై మాటల యుద్ధాన్ని తీవ్రం చేశారు. ఈ నేపథ్యంలో హిజ్బుల్ నేత హసన్ నస్రాల్లా తీవ్రంగా స్పందించారు. 'పశ్చిమాసియాలో మన సామూహిక బాధ్యత ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని నివారించడానికి కృషి చేయడమే' అని ఆయన అన్నారు.