తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్​లో ఫేస్​బుక్ బంద్- నిరసనలు తీవ్రం

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా వైద్యులు శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టారు. సైన్యం అధీనంలో పనిచేసేది లేదని స్పష్టం చేశారు. ఛారిటీ వైద్య కేంద్రాల్లో సేవలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, నిరసనలు పుంజుకుంటున్న వేళ మయన్మార్​లో ఫేస్​బుక్ సేవలను నిలిపివేసింది సైన్యం.

Health workers in virus-hit Myanmar start anti-coup protests
మయన్మార్​లో వైద్యుల నిరసనలు- ఫేస్​బుక్ బంద్

By

Published : Feb 4, 2021, 11:59 AM IST

Updated : Feb 4, 2021, 1:52 PM IST

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా ఆ దేశంలోని వైద్యులు శాసనోల్లంఘన ఉద్యమాన్ని చేపట్టారు. ప్రజాస్వామ్య అనుకూల నిరసనలకు ప్రతీకగా ఎర్రటి రిబ్బన్లను ధరించారు. సైనిక ప్రభుత్వానికి తాము పనిచేసేది లేదని తెగేసి చెప్పారు.

మయన్మార్​లో వైద్యుల నిరసనలు

"సైనిక నియంతృత్వానికి మేం పూర్తిగా వ్యతిరేకమని ప్రపంచానికి చాటిచెప్పాలని అనుకుంటున్నాం. ఎన్నికైన ప్రభుత్వానికే తాము పనిచేస్తామని సైన్యానికి చెప్పాలనుకుంటున్నాం. అందుకే నిరసనలు చేపట్టాం. మయన్మార్​లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పునరుద్ధరించాలి. మా నేతలను విడుదల చేయాలి."

-డా. జున్ ఎయ్ ఫ్యూ, యంగోన్​లోని వైద్యురాలు

నిరసనలు జరుగుతున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొనసాగే హెల్త్ క్లినిక్​లలో వైద్యులు సేవలందిస్తున్నారని జున్ తెలిపారు. అవసరమైనవారికి ఉచితంగా ఔషధాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ప్రజలు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాత్రి సమయంలో శబ్దాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. విప్లవ గేయాలను పాడుతూ.. నినాదాలు చేశారు.

చప్పుళ్లు చేస్తూ నిరసన

ఫేస్​బుక్​పై ఉక్కుపాదం

సామాజిక మాధ్యమాల ద్వారా సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రజలకు అక్కడి రాజకీయ నేతలు పిలుపునిస్తున్న వేళ.. ఈ సమాచార వ్యవస్థపై సైన్యం ఉక్కుపాదం మోపింది. ఫేస్​బుక్​ సేవలను దేశంలో నిలిపివేసింది. బుధవారం రాత్రి నుంచే ఈ సేవలకు అంతరాయం ఏర్పడింది.

సమాచార మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తాత్కాలికంగా ఫేస్​బుక్​ను నిలిపివేసినట్లు సర్వీస్ ప్రొవైడర్ 'టెలినార్ మయన్మార్' వెల్లడించింది. ప్రభుత్వ ఉత్తర్వులు మానవ హక్కులను ఉల్లంఘించేలా ఉన్నప్పటికీ.. పాటించక తప్పలేదని పేర్కొంది.

ఫేస్​బుక్​కు మయన్మార్​లో విశేష ప్రధాన్యం ఉంది. సూకీ ప్రభుత్వం కూడా ఈ సామాజిక మాధ్యమ వేదికగానే ప్రజలకు తరచుగా సమాచారం అందించేది.

'ఐక్యంగా పోరాడదాం'

మయన్మార్​లో సైనిక చర్యను తిప్పికొట్టేందుకు అవసరమైన అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తానని ప్రతినబూనారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. ఈ విషయంలో ఐరాస భద్రతా మండలి ఇప్పటికీ ఏకతాటిపైకి రాకపోవడం దురదృష్టకరమని అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 4, 2021, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details