కొవిడ్-19తో(Covid-19) ఆసుపత్రిపాలైన వారిని ఏడాది తర్వాత కూడా రుగ్మతలు వదలడంలేదు. 12 నెలలు గడిచినా.. ఇలాంటివారిలో దాదాపు సగం మందిని ఆ ఇన్‌ఫెక్షన్ మిగిల్చిన ఏదో ఒక సమస్య(Covid symptoms) పీడిస్తోందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ వివరాలు వైద్య పత్రిక 'ద లాన్సెట్'లో ప్రచురితమయ్యాయి. చైనాలోని వుహాన్‌లో 1,276 మందిపై పరిశోధన చేసి, ఈ మేరకు తేల్చారు. కొందరు రోగులు(Covid patients) కోలుకోవడానికి ఏడాది కన్నా ఎక్కువ సమయం పడుతోందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో మహమ్మారి(Covid pandamic) అనంతరం అందించాల్సిన వైద్య సేవలకు ప్రణాళిక రచించేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పరిశోధనలో భాగంగా గత ఏడాది జనవరి 7 నుంచి మే 29 మధ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కొవిడ్(Corona virus) బాధితులపై పరిశీలన చేపట్టారు. ఆరు నెలలు, ఏడాది సమయంలో వీరికి పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తద్వారా వారిలో వ్యాధి లక్షణాలు, ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. వారికి ముఖాముఖీ ప్రశ్నలు సంధించడం, శారీరక, ల్యాబ్ పరీక్షలు నిర్వహించడం, ఆరు నిమిషాల పాటు నడిపించి చూడటం వంటివి చేశారు. ఈ బాధితుల సరాసరి వయసు 57 ఏళ్లు. పరిశోధనలో వెల్లడైన అంశాలివీ..
- కొవిడ్ తీవ్రతతో సంబంధం లేకుండా వ్యాధి లక్షణాల్లో అనేకం.. కాలక్రమేణా తగ్గిపోయాయి. అయితే ఆరు నెలల సమయంలో వీరిలో 68 శాతం మందిలో కనీసం ఒక్క లక్షణమైనా కనిపించింది. 12 నెలలకు అది 49 శాతానికి తగ్గింది.
- కొవిడ్ నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత ఎక్కువగా కనిపించిన సమస్యలు.. అలసట, కండరాల బలహీనత. దాదాపు సగం మందిలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఏడాది తర్వాత.. ప్రతి ఐదుగురిలో ఒకరిని ఈ సమస్యలు వదల్లేదు.
- 12 నెలల తర్వాత ప్రతి ముగ్గురిలో ఒకరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపించింది. ఆరు నెలల సమయంలో మాత్రం ఇంకా ఎక్కువ మందిని ఈ సమస్య పీడించింది. ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నవారిలో ఎక్కువ మందిని ఈ ఇబ్బంది వెంటాడింది.
- ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్షలోనూ కొన్ని అంశాలు బయటపడ్డాయి. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి ప్రక్రియ సజావుగా సాగని వారి పరిస్థితి ఆరు నుంచి 12 నెలల మధ్య మెరుగుపడలేదని వెల్లడైంది.
- ఆరు నెలల సమయంలో 353 మంది ఛాతీకి సీటీ స్కాన్ నిర్వహించారు. వారిలో సగం మందికి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్లు తేలింది. 118 మందికి 12 నెలల తర్వాత కూడా దీన్ని నిర్వహించారు. అప్పటికల్లా సమస్యలు తగ్గినప్పటికీ.. కొందరిలో అవి కొనసాగాయి.
- పురుషులతో పోలిస్తే మహిళలు పన్నెండు నెలల తర్వాత 1.4 రెట్లు ఎక్కువగా అలసట, కండరాల బలహీనతను; రెట్టింపు స్థాయిలో ఆందోళన, కుంగుబాటును; మూడు రెట్లు ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది.