ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్, అతడి అనుచరులు 12మందిని త్వరలో అరెస్టు చేయనున్నామని ప్రకటించారు పాకిస్థాన్ పోలీసులు. ఉగ్రసంస్థలకు ఆర్థిక చేయూత అందిస్తున్నారన్న కారణంతో హఫీజ్‌పై కేసు నమోదు చేశారు. పాకిస్థాన్ పంజాబ్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం బుధవారం హఫీజ్ సహా 13మందిపై కేసు నమోదు చేసింది.
ఉగ్ర కార్యాకలాపాలకు సహకరిస్తున్నారన్న కారణంతో నిషేధిత గ్రూపులకు చెందిన కొంతమంది సభ్యులను ఇంతకుముందే పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద వ్యతిరేక కోర్టుల ద్వారా విచారించి శిక్ష విధించారు.
హఫీజ్‌ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వ అంగీకారం కోసం వేచి చూస్తున్నాన్నామని పాక్ పంజాబ్ పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. లాహోర్ రాష్ట్రం జౌహార్లోని స్వగృహంలోనే సయీద్ ఉన్నారని తెలుస్తోంది.
హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తోయిబాకుజమాత్ ఉద్ దావా మాతృసంస్థని, 2008 ముంబయి దాడికి పాల్పడింది ఇదే సంస్థని భారత్ ఆరోపిస్తుంది. 2014 జూన్‌లో లష్కరేను సీమాంతర ఉగ్రసంస్థగా తీర్మానించింది అమెరికా.
2012లో హఫీజ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. హఫీజ్‌ను పట్టించిన వారికి 6 కోట్ల 80 లక్షల రూపాయల నజరానా అందిస్తామని వెల్లడించింది.
పాక్ అరెస్టు చేస్తామని ప్రకటించిన వారిలో అబ్దుల్ రెహమాన్ మక్కీ(డిప్యూటీ చీఫ్ జమాత్ ఉద్ దవా, సయీద్ బావమరిది), మాలిక్ జాఫర్ ఇక్బాల్, అమీర్ హంజా, ముహమ్మద్ యహ్యా అజీజ్, ముహమ్మద్ నయీమ్, మోహసిన్ బిలాల్, అబ్దుల్ రఖీబ్, అహ్మద్ దావూద్, ముహమ్మద్ అయూబ్, అబ్దుల్లా ఉబేయిద్, ముహమ్మద్ అలీ, అబ్దుల్ గఫార్ ఉన్నారు.
ఇదీ చూడండి: ట్వీట్‌తోనే పర్యటకుల సమస్యల పరిష్కారం!