కరుడుగట్టిన ఉగ్రవాది, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌పై నేరారోపణకు మరికొంత సమయం పట్టనుంది. శనివారం విచారణ సందర్భంగా అధికారులు.. సహ నిందితుల్ని ప్రవేశపెట్టని కారణంగా తదుపరి విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది లాహోర్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ఇతర సహ నిందితులు మాలిక్ జఫార్ ఇక్బాల్‌లను డిసెంబర్ 11న జైలు నుంచి కోర్టు ముందు ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది.
2008 నాటి ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్‌ను ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలతో జులై 17న పాక్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం.. అతడ్ని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. హఫీజ్ కేసుకు సంబంధించిన అభియోగ పత్రాలను సమర్పించాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. తాజాగా.. సహ నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు అధికారులు.
సయీద్ నేతృత్వంలోని 'జేయూడీ' సంస్థ లష్కరే తోయిబాను ముందుండి నడిపిస్తున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. 2008లో ముంబయిలో ఉగ్రదాడులకు బాధ్యత వహించింది లష్కరే తోయిబా. ఆ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.