ఫిలిప్పీన్స్‌లో సాయుధులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మోటార్ సైకిల్‌పై వస్తున్న కొందరిని ఆపిన దుండగులు వారిపై తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. ఇందులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కొటాబటో రాష్ట్రం కబాకన్ పట్టణ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శనివారం మధ్యాహ్నం కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల్లో చాలా మంది వ్యవసాయదారులే ఉన్నారని పేర్కొన్నారు. ఇది ఉగ్రవాదుల పని కాదని, స్థానికంగా చెలరేగిన ఘర్షణ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఘటన జరిగిందిలా..
ఆరు ద్విచక్ర వాహనాల్లో వెళ్తున్న వీరిని దారిలో ఎనిమిది మంది సాయుధులు అడ్డుకుని.. వాహనం దిగిపోవాలని హెచ్చరించారు. ఆ తర్వాత రైఫిళ్లు, పిస్తోళ్లతో 39 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగులు ఓ వ్యాన్‌లో పారిపోయారు. ప్రత్యక్ష సాక్షులను విచారించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వారం రోజుల క్రితమే ఉన్మాదుల దాడి
గత సోమవారమే ఫిలిప్పీన్స్‌లో ఉగ్రదాడి జరిగింది. ఇద్దరు మహిళలు బాంబులు ధరించి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో 15 మంది మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా ఘటన ఉగ్రవాదుల పని కాదని పోలీసులు స్పష్టం చేశారు.