తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్​లో కాల్పుల కలకలం - fire on bus carrying muslim voters in srilanka

శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ముస్లిం ఓటర్లతో వెళ్తున్న వాహనాలపై దుండగులు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. ఓటర్లు వెళ్తున్న దారికి అడ్డంగా టైర్లను కాల్చినట్లు వెల్లడించారు.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్​లో కాల్పుల కలకలం

By

Published : Nov 16, 2019, 10:28 AM IST

ఈస్టర్ బాంబు పేలుళ్ల తర్వాత భద్రతా సవాళ్లతో సతమతమవుతున్న శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే వాయువ్య శ్రీలంకలోని మన్నార్ ప్రాంతంలో ముస్లిం ఓటర్లతో వెళ్తున్న కాన్వాయ్​పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కాన్వాయ్​పై రాళ్లు రువ్వినట్లు తెలిపారు పోలీసులు.

'తీర ప్రాంతమైన పుట్టలమ్​కు చెందిన ముస్లింలు పక్కనే ఉన్న మన్నార్​ జిల్లాకు ఓటేయడానికి వెళ్తున్నారు. ఈ వాహన శ్రేణిపై ఓ సాయుధుడు కాల్పులు ప్రారంభించాడు. కాన్వాయ్​పై రాళ్లు కూడా విసిరాడు. రెండు బస్సులపై ఈ దాడి జరిగింది. క్షతగాత్రుల గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు.'-పోలీస్ అధికారి

దాదాపు 100 వాహనాలతో కూడిన కాన్వాయ్​పై దాడి చేయడానికి దుండగులు రోడ్లకు అడ్డంగా టైర్లను కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. రహదార్లకు అడ్డుగా ఉన్న టైర్లను తొలగించారు.

సైన్యం దుశ్చర్య...!

మైనారిటీ ఓటర్లను తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆ దేశ సైన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చట్టవిరుద్ధంగా రహదార్లను సైన్యమే అడ్డుకుంటుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఓటర్లను ఆపేందుకు సైన్యం ప్రయత్నిస్తోందని ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇలాంటివి చట్టవిరుద్ధమని సైన్యం దృష్టికి తీసుకువచ్చిన తర్వాత అడ్డు తొలగించినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

మైనారిటీలైన ముస్లింలు, తమిళుల ప్రభావం శ్రీలంక ఎన్నికల్లో ఎక్కువగా ఉంది. అభ్యర్థుల జయాపజయాలు వారి ఓట్లపైనే ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున సైన్యం మోహరించిన ఉన్న ప్రాంతాల్లో... మాజీ రక్షణ మంత్రి, మహీంద రాజపక్స సోదరుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి గోటబయా రాజపక్సకు అనుకూలంగా ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని స్థానిక వార్తా సంస్థలు భావిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details