తెలంగాణ

telangana

ETV Bharat / international

113 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యం ఇదే.!

వందేళ్లు బతికితే గొప్పగా భావించే నేటితరంలో.. రానూ రానూ మానవుని ఆయుష్షు క్షీణిస్తోంది. 'వందేళ్లు జీవించు!' అనే ఆశీర్వచనం లాంటి మాటలు వినడం తప్ప ఆ వయసుకు చేరుకునే వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటిది ఏకంగా 113 ఏళ్లుగా భూమిపై తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ... గిన్నిస్​ రికార్డును సొంతం చేసుకున్నాడు జపాన్​కు చెందిన​ వృద్ధుడు.

Guinness: Oldest man in Japan
అత్యంత పెద్ద వయస్కుడిగా జపాన్​ కురువృద్ధుడి గిన్నిస్​ రికార్డు

By

Published : Feb 13, 2020, 6:04 AM IST

Updated : Mar 1, 2020, 4:05 AM IST

అత్యధిక కాలం జీవించి ఉన్న పురుషుడిగా జపాన్​కు చెందిన చిటేషు వాటనేబ్​ ప్రపంచ గిన్నిస్​ రికార్డు నెలకొల్పాడు. ఇతని వయస్సు 112 ఏళ్ల 344 రోజులు. గతంలో ఈ రికార్డు ఇదే దేశానికి చెందిన మసాజో పేరిట ఉంది. అతను జనవరిలో మరణించిన కారణంగా రికార్డు చిటేషు వశమైంది.

1907లో జన్మించి...

ఉత్తర జపాన్​-నీగాటాలో 1907లో జన్మించిన చిటేషు వాటనేబ్​... అదే నగరంలో గల ఓ ఆసుపత్రి నుంచి ఇటీవలే తన జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. వ్యవసాయ విద్యలో పట్టభద్రుడయ్యాక.. చెరకు పరిశ్రమల్లో పనిచేసేందుకు తైవాన్​ వెళ్లాడు. 18 ఏళ్ల పాటు అక్కడే నివసించిన చిటేషు.. మిత్సూయీ అనే మహిళను వివాహమాడారు. వీరికి ఐదుగురు సంతానం.

113 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యం ఇదే.!

కోపం వద్దు - నవ్వే ముద్దు...

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత తన స్వస్థలానికి వచ్చాడు వాటనేబ్​. పదవీ విరమణ వరకూ ప్రభుత్వ పాలకవర్గంలో పనిచేశాడు. అనంతరం కుటుంబంతోనే గడుపుతూ.. తన పొలంలోనే కూరగాయలు, పండ్లను పండించేవాడు. దశాబ్దం కిందటి వరకు వాటనేబ్ జపనీస్​ సంప్రదాయ కళల్లో భాగంగా.. బొన్సాయ్​ చెట్లను పెంచుతుండేవాడు.

తన దీర్ఘకాల జీవిత రహస్యం గురించి అడగ్గా... 'ఎలాంటి పరిస్థితుల్లోనైనా కోపాన్ని దరిచేరనీయకుండా, నవ్వుతూ ఉండాలి' అని సలహా ఇచ్చాడు వాటనేబ్​.

అయితే ప్రస్తుతం అత్యధిక వయస్సు కలిగిన మహిళ రికార్డు కూడా జపాన్​కు చెందిన బామ్మ పేరిటే ఉంది. 117 ఏళ్ల కానే​ తనాకా అనే వృద్ధురాలు.. భూమిపై అత్యధిక కాలం జీవించి ఉన్న మహిళగా రికార్డు నెలకొల్పింది.

ఇదీ చదవండి:కరోనాపై కోపం- ఒంటికి బాంబులు కట్టుకుని, పెట్రోల్ పోసుకుని..

Last Updated : Mar 1, 2020, 4:05 AM IST

ABOUT THE AUTHOR

...view details