తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాపై కప్పదాటు ధోరణి చాలా ప్రమాదం - world Health Organisation

చైనాలో మొదలై ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా కోరలు చాస్తోంది. విశ్వమానవాళికి పెనుముప్పుగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. సమస్య ఎదురైన వెంటనే పరిష్కార మార్గాలు అన్వేషించి సమసిపోయేలా చేయాలి లేదా నియంత్రణ చర్యలు చేపట్టాలి. అంతేకాని చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం శూన్యమే. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఇదే. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి?

Grab the china on the coronavirus
కరనాపై కప్పదాటు ధోరణి.. ప్రమాదమే

By

Published : Apr 10, 2020, 7:40 AM IST

సమస్య ఎదురైన వెంటనే అప్రమత్తమైతే ఫలితం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో, ఉదాసీనంగా ఉంటే ఎలాంటి ఫలితాన్ని చవిచూడాల్సి వస్తుందో దక్షిణకొరియా, అమెరికాల వ్యవహారశైలి తేటతెల్లం చేస్తోంది. ఒకరిని చూసి నేర్చుకోవడం ఏమిటన్న ట్రంప్‌ వైఖరే ఇప్పుడు అమెరికాకు పెనుముప్పుగా మారింది. జనవరి 20న దక్షిణ కొరియాలో తొలి కరోనాకేసు నమోదైంది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికాలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు వెలుగుచూసింది.

వెంటనే ఆదేశాలు

దక్షిణ కొరియా వారంలోపే పరీక్ష కిట్లను అభివృద్ధి చేయాలని, వైద్య పరికరాలను సిద్ధం చేయాలని 20 ప్రైవేటు కంపెనీలను ఆదేశించింది. మరోవారంలో పెద్దయెత్తున పరీక్షలు చేపట్టి, బాధితులను గుర్తించింది. మార్చి 11 నాటికే అక్కడ ప్రతి పదిలక్షల మందిలో సగటున 3,692 మందికి పరీక్షలు నిర్వహించగా- అదే సమయానికి అమెరికాలో సగటున అయిదుగురికి పరీక్షలు నిర్వహించారు. అప్పటికే పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది.

చైనా​ తీరుతో పెనుముప్పు

చైనాలోని డాక్టర్ల నుంచి సమాచారం తెలుసుకున్న తైవాన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉప్పందించింది. తర్వాత చైనా అది 'అంటువ్యాధి' అనే విషయాన్ని దాచిపెట్టి అధికారికంగా డబ్ల్యూహెచ్‌ఓకు సమాచారం అందించింది. ఆ సంస్థ కూడా చైనాకు వంతపాడటంతో ప్రపంచం అప్రమత్తం కాలేకపోయింది. అప్పటికే నూతన సంవత్సర వేడుకల కోసం వుహాన్‌ నుంచి లక్షల మంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో వైరస్‌ చైనా సరిహద్దులు దాటింది. తరవాతే వుహాన్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇప్పటికీ రోగ లక్షణాలు, మృతుల వివరాలను పూర్తిస్థాయిలో చైనా బాహ్యప్రపంచానికి ఇవ్వలేదు. పైగా ఇటీవల షి జిన్‌పింగ్‌ను ఆకాశానికెత్తుతూ '2020 ఎ బ్యాటిల్‌ అగైన్స్ట్‌ ఎపిడమిక్‌' పుస్తకాన్ని విడుదల చేసింది.

రాజకీయ అస్థిరత కారణం

చైనాపై ఇటలీ చూపిన అతిప్రేమ వారి ప్రాణాలమీదకు తెచ్చింది. ఇటలీలో 50 ఏళ్లలో దాదాపు 60కి పైగా ప్రభుత్వాలు మారాయి. ఈ రాజకీయ అస్థిరత కారణంగా ఆర్థిక వ్యవస్థ కుంగిపోయి- ఆ దేశం చైనాను ఆశ్రయించాల్సి వచ్చింది. జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య ఆత్యయిక పరిస్థితిని ప్రకటించిన రెండు రోజుల తరవాత 'హగ్‌ ఎ చైనీస్‌' పేరుతో ఇటాలియన్లు చైనీయులను కౌగిలించుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. చైనా పర్యటకులు భారీ సంఖ్యలో ఇటలీకి వెళ్లారు. ఇది జరిగిన కొన్నాళ్లకే లంబార్డెలో తొలి కరోనా కేసు నమోదైంది. అనంతరం ఈ అంటువ్యాధి కొండచిలువలా ఇటలీని చుట్టేసి 17 వేల మందికి పైగా ప్రాణాలను బలితీసుకొంది.

తైవాన్​ ముందుజాగ్రత్త

చైనా సంగతి బాగా తెలిసిన తైవాన్‌ డిసెంబర్‌ 31 నుంచే అప్రమత్తమై విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టింది. వుహాన్‌ వాసుల రాకపై జనవరి 23న, చైనా పర్యటనలపై జనవరి 25న, చైనా పర్యటకులు తైవాన్‌కు రావడంపై ఫిబ్రవరి 6న నిషేధం విధించింది. జనవరి 24న వైద్య పరికరాలను సిద్ధం చేయాలని స్థానిక కంపెనీలను ఆదేశించింది. జనవరి 31న మాస్కుల పంపిణీని ప్రభుత్వం చేపట్టింది. అత్యాధునిక సాంకేతికతను వాడుకొని బాధితులపై నిఘాపెట్టింది.

ముఖ్యంగా ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన పెంచింది. ఫలితంగా ఏప్రిల్‌ తొమ్మిది నాటికి అక్కడ నమోదైన కరోనా కేసులు 379కి పరిమితమయ్యాయి. చైనా-తైవాన్‌ మధ్య దూరం 81 మైళ్లే. ఫలితాల్లో మాత్రం ఎంతో వ్యత్యాసముంది. ఆరోగ్య ఆత్యయిక సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పరిశీలనలోకి తీసుకొంటూనే సొంత విశ్లేషణలతో వ్యూహాలను సిద్ధం చేసుకొని మెరుపువేగంతో అమలు చేయాలి. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వాలు అంతిమంగా ప్రజలకే జవాబుదారి కానీ, ప్రపంచ ఆరోగ్యసంస్థకు కాదని గుర్తించాలి.

-పెద్దింటి ఫణికిరణ్​

ఇదీ చూడండి:కరోనా పంజా: ప్రపంచవ్యాప్తంగా 90వేలు దాటిన మరణాలు

ABOUT THE AUTHOR

...view details