New Zealand Smoke Free: ధూమపానంపై నిషేధం విధించడమే లక్ష్యంగా న్యూజిలాండ్ ప్రభుత్వం వినూత్న ప్రతిపాదన తీసుకొచ్చింది. ఏటా ధూమపానం చేసేందుకు యువతకు ఉండాల్సిన కనీస వయసును పొడగించనుంది. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం గురువారం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ చర్యతో ప్రస్తుతం 14 ఏళ్లు లేదా అంతన్నా తక్కువ వయసు ఉన్న వారికి సిగరెట్లపై జీవితకాల నిషేధం విధించినట్లైంది.
65 ఏళ్ల తర్వాత..
ఈ కొత్త ప్రతిపాదన చట్టంగా వస్తే 65 ఏళ్ల తర్వాత సిగరెట్లు కొనుగోలు చేసేందుకు ఉండాల్సిన కనీస వయసు 80 ఏళ్లకు చేరుతుంది. ఇలా చేయడం వల్ల దేశంలో రానురానూ.. సిగరెట్ వినియోగం తగ్గిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2025 నాటికి దేశంలో పొగతాగేవారి సంఖ్య 5 శాతం కన్నా తక్కువ ఉండాలన్నది న్యూజిలాండ్ ప్రభుత్వ లక్ష్యం.
ప్రస్తుతం న్యూజిలాండ్‌లో సిగరెట్ కాల్చాలంటే ఉండాల్సిన కనీస వయసు 18 ఏళ్లు.
ఆ ఉత్పత్తులపైన కూడా..
సిగరెట్లపై నిషేధంతో పాటు పొగాకు ఉత్పత్తులపై కూడా ఆంక్షలను విధించనుంది ప్రభుత్వం. విక్రయదారులు నికొటిన్ మోతాదు తక్కువ ఉన్న పొగాకు ఉత్పత్తులనే ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని పేర్కొంది. ఈ ఉత్పత్తులు విక్రయించే స్టోర్ల సంఖ్యను తగ్గించనుంది. అయితే ఇందుకోసం రిటైలర్లకు కొంత సమయం ఇవ్వనుంది.
"పొగాకు ఉత్పత్తుల ద్వారా ఎందరో అనారోగ్యం పాలవుతున్నారు. ఏటా సగటున 5వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ మరణాలను కట్టడి చేసేందుకు పన్ను పెంచడం వంటి చర్యలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావట్లేదు. కొంతమంది సుంకాలను మరింత పెంచాలని సూచిస్తున్నారు.. కానీ అలా చేస్తే స్మోకింగ్ అలవాటు ఉన్న వారిపై మరింత భారం పడుతుంది. అందుకే ఈ ప్రతిపాదనను తెచ్చాము. దీని వల్ల భవిష్యత్తు తరాల వారు ఈ అలవాటుకు దూరంగా ఉంటారు."
-డాక్టర్ అయేష్ వెరాల్, న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి
ఈ చర్యతో వారికి నష్టం..
ప్రభుత్వ ప్రతిపాదను పలువురు స్థానికులు తప్పుపట్టారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఎందరో చిరు వ్యాపారులు నష్టపోతారని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం సుంకాలు పెంచడం వల్ల ఇప్పటికే బ్లాక్ మార్కెట్ కూడా ఏర్పడిందని.. తాజా ప్రతిపాదన పరిస్థితిని మరింత దిగజారుస్తుందన్నారు.
న్యూజిలాండ్‌లో స్మోకర్ల సంఖ్య గత కొన్నేళ్లలో గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో కేవలం 11 శాతం పెద్దలకు ధూమపానం చేసే అలవాటు ఉంది. వీరిలో 9 శాతం మంది రోజు సిగరెట్ తాగుతారు. అయితే న్యూజిలాండ్‌లో ఉండే మౌరి వర్గానికి చెందిన ప్రజల్లో మాత్రం పొగతాగేవారి శాతం 22కి చేరింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో కట్టడికి చర్యలు చేపడుతోంది.
ప్రభుత్వ ప్రతిపాదనను వెరాల్ సమర్థించుకున్నారు. ఇది సిగరెట్ అలవాటు మానేవారికి సాయపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :సీడీఎస్ రావత్ దుర్మరణంపై చైనా, పాక్ రియాక్షన్ ఇలా...