తిరుగుబాటుదారుల నియంత్రణలోని ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రిపై బాంబుల వర్షం కురిపించాయి ప్రభుత్వ బలగాలు. ఈ దాడిలో ఓ చిన్నారి సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయప్డాడరు. వారిలో వైద్యసిబ్బంది కూడా ఉన్నారు. ఈ దాడితో ఆసుపత్రిని మూసివేశారు.
భారీ నష్టం..
పశ్చిమ అలెప్పోలోని అటారెబ్ పట్టణ సమీప ప్రాంతంతో పాటు ఆసుపత్రి ప్రాంగణంపై దాడులు జరిగినట్టు బ్రిటన్ ఆధారిత సిరియా మానవ హక్కుల పరిశీలనా విభాగం తెలిపింది. ప్రభుత్వం, దాని అనుబంధ (రష్యాతో పాటు) బలగాలే ఈ దాడులు చేసినట్లు ఆరోపించారు. భూగర్భంలోని సిరియన్ అమెరికన్ మెడికల్ సొసైటీపై మూడు క్షిపణులు పడగా.. ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ క్లినిక్ కూలిపోయింది. పైకప్పు మీదున్న జనరేటర్లు ధ్వంసమయ్యాయి. తీవ్ర ఆస్తినష్టం వాటిల్లినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు.
దాడుల నేపత్యంలో ఆసుపత్రిని ఖాళీ చేయించారు. గాయపడిన వారిలో నలుగురిని అత్యవసర చికిత్స నిమిత్తం టర్కీకి తరలించినట్టు అక్కడి మీడియా వెల్లడించింది.