పొరుగున శ్రీలంకతో ఇండియా నెయ్యం 'సేతు'వుల కాలం నాటిది. దాదాపు 12 శాతంగా ఉన్న తమిళుల జన సంఖ్య రీత్యా బొడ్డు పేగు బంధంతోపాటు, ఆ దేశ సమైక్యత సమగ్రతలకోసం నెత్తురు చిందించిన ఐపీకేఎఫ్ (ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్) త్యాగాల రీత్యా శ్రీలంకతో రక్త సంబంధమూ బలంగా పెనవడి ఉంది. ద్వీప దేశానికి పెద్ద దిక్కుగా ఇండియా దశాబ్దాల తరబడి చేదోడు వాదోడుగా ఉన్నప్పటికీ 2005లో శ్రీలంక అధ్యక్షుడిగా మహింద రాజపక్స ఎన్నికైనప్పటినుంచే కొలంబోకు బీజింగుతో సాన్నిహిత్యం బలపడుతూ వచ్చింది.
దిల్లీ-కొలంబోల మధ్య సంబంధాలు?
తమిళ పులుల ఉగ్రవాదాన్ని తెగటార్చి తనకిక ఎదురే లేదనుకొన్న మహింద రాజపక్స- 2015లో తన ఘోర పరాజయానికి ఇండియానే కారణమని ఘాటు విమర్శలు రువ్వారు. ఇటీవలి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహింద సోదరుడు గోటబాయ రాజపక్స ఘన విజయం సాధించడం, దేశ ప్రధానిగా మహిందను నియమించడంతో దిల్లీ- కొలంబోల మధ్య సంబంధాలు ఏ తీరుగా ఉండబోతున్నాయన్న సందేహాలు జోరెత్తాయి. క్షేత్రస్థాయి వాస్తవాల్ని గుర్తించి గోటబాయ ప్రమాణ స్వీకారం మర్నాడే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ద్వారా ప్రధాని మోదీ సాదర ఆహ్వానాన్ని అందించడం, దాన్ని మన్నించి శ్రీలంక అధ్యక్షుడు విచ్చేయడం- వాతావరణాన్ని ఎంతగానో తేటపరిచాయి.
ఉభయ దేశాల సంబంధాల్ని అత్యున్నత స్థాయికి చేర్చాలన్న సంకల్పం ప్రకటించిన గోటబాయ, భారతావని భద్రతను దెబ్బతీసేలా ఏ పనీ చేయాలనుకోవడం లేదని స్పష్టీకరించారు. అపోహలు, అపార్థాలు తొలగిపోయేలా నిక్కచ్చిగా వ్యవహరిస్తామన్న ప్రకటనను వెన్నంటి శ్రీలంకలో చైనా పెట్టుబడులకు ప్రత్యామ్నాయం ఏమిటో ఇండియా సహా ఇతర దేశాలే చూపాలనీ కోరుతున్నారు. లంకలో ఉగ్రవాద నిర్మూలన వ్యవస్థల బలోపేతానికి రూ.360 కోట్లు, సులభతర రుణం రూపేణా మరో రూ.2870 కోట్లు ఇస్తున్న ఇండియా పాత చెలిమికి కొత్తగా పాదు చేసే క్రమంలో జాగ్రత్తగా అడుగులు వేయక తప్పదు!
అధ్యక్ష ఎన్నికలు అద్దం పట్టేలా
పక్షం రోజుల క్రితం నాటి అధ్యక్ష ఎన్నికలు లంక సమాజంలోని భిన్న వర్గాల ప్రజల తీవ్ర భయాందోళనలకే అద్దం పట్టాయి. నిరుడీ రోజుల్లో దేశాధ్యక్షుడిగా మైత్రీపాల సిరిసేన రాజేసిన రాజకీయ సంక్షోభం శ్రీలంకను అస్థిర పరిస్థితుల్లోకి నెట్టేయడంతోపాటు భద్రతా వ్యవస్థల్నీ నిస్తేజం చేసేసింది. ‘సుప్రీం’ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు దరిమిలా ప్రధాని పదవీ పగ్గాలు విక్రమసింఘే చేతికి వచ్చినా, ‘ఈస్టర్ డే’ నాటి భయానక బాంబు దాడులతో యావద్దేశం కన్నీటి సంద్రమైంది. ఇండియా, అమెరికాలనుంచి బాంబుదాడుల ముప్పుపై ముందస్తుగా విస్పష్ట సమాచారం ఉన్నా భద్రతా యంత్రాంగాలు వెలగబెట్టిన నిష్క్రియను పార్లమెంటరీ సెలక్ట్ కమిటీ సూటిగా తప్పుపట్టింది. కొత్తగా కోరసాచిన ఐఎస్ ఉగ్రవాదాన్నీ ఉక్కుపాదంతో అణచివేయాలంటే అధ్యక్ష పదవికి గోటబాయే సరైన వ్యక్తి అని సింహళ మెజారిటీ జనావళి విశ్వసించింది.